చిన్నారుల కళ్లను ఎలా కాపాడుకోవాలో డాక్టర్ మంజూ భాటే మన ఈటీవీ భారత్ సుఖీభవతో పంచుకున్నారు. అవేంటో చూసేయండి మరి...
ఇవి సాధారణమే...
- పిల్లలలో వక్రీభవన లోపాలు సర్వసాధారణం. అలర్జీ కండ్లకలక, కంటిలో మంట వంటి సమస్యలతో చిన్నారులు బాధపడితే పెద్దగా భయపడనక్కర్లేదు.
పరీక్షలు ఎప్పుడు అవసరం..?
- 3-4 ఏళ్ల పిల్లలకు తరచూ కళ్ల పరీక్షలు చేయిస్తే మంచిది. ఆ వయసులో కనుపొరలు సున్నితంగా ఉంటాయి కాబట్టి సమస్యలు ఉంటే, చికిత్సతో నయం చేయొచ్చు.
- ఇక పిల్లలు అదేపనిగా కంటిని నలుస్తూ, కంటి సమస్యతో బాధపడుతున్నట్లు అనిపిస్తే.. వెంటనే కంటి వైద్యున్ని సంప్రదించాలి.
- చిన్నారులు పుస్తకాలు, వస్తువులూ మరీ దగ్గరగా పెట్టి చూడటం, కళ్లు చిన్నగా చేసి చూడటం చేస్తే కంటి సమస్య అని అనుమానించి పరీక్షలు చేయించాలి.
ఎలా కాపాడుకోవాలి..?
- పిల్లలు వెలుతురు బాగా ఉన్న గదిలోనే చదువుకోవాలి. మసక, చీకటి గదిలో చదవడానికి, రాయడానికి ప్రయత్నించొద్దు.
- కౌమార దశ పూర్తయ్యేదాకా ఫోన్లు, టీవీ స్క్రీన్లకు వీలైనంత దూరంగా ఉంటే మంచిది.
- తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తరచూ పిల్లల చూపులో తేడాను గమనిస్తూ ఉండాలి.
ఆహారం మార్చాలా?
- కంటి కోసం ప్రత్యేకంగా ఆహారం తీసుకోవాల్సిన పనిలేదు. భారతీయ వంటకాల్లో కంటికి అందాల్సిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
- అయితే, చిన్నారి పోషకాహార లోపంతో ఉంటే మాత్రం తప్పకుండా వైద్యుల సలహా మేరకు ఆహార మార్పులు చేయాలి.
- కంటి ఇన్ఫెక్షన్ ఉన్నవారికి దూరంగా ఉంటే, ఆ ఇన్ఫెక్షన్ పిల్లలకు సోకకుండా ఉంటుంది.
-డాక్టర్ మంజూ భాటే, ఎంబీబీఎస్, డీఎన్బీ(కంటి వైద్యులు)
ఎల్.వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి, హైదరాబాద్