ECG Heart Problem Indication : గుండె పనితీరును తెలుసుకునేందుకు చేసే పరీక్షల్లో ఈసీజీ ఒకటి. ఈసీజీలో వచ్చిన ఫలితం ఆధారంగా వైద్యులు ఒక అంచనాకు వస్తారు. దీని ద్వారా గుండె జబ్బు ఉందో? లేదో? తెలియజేస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో ఈసీజీలో స్వల్ప మార్పులు కనిపిస్తాయి. అయినంత మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు చెబుతున్నారు.
ECG Test Analysis : ఈసీజీ పరీక్ష చేసినప్పుడు చాలా మందిలో కొంచెం తేడా కనిపించవచ్చు. అయినంత మాత్రాన ఈసీజీలో కనిపించే మార్పులు గుండె జబ్బులకు కారణం కాదని వైద్య నిపుణుల అభిప్రాయం. ఈసీజీ నార్మల్ ఉన్నంత మాత్రాన గుండె జబ్బు లేదని అనుకోవడానికి కూడా వీల్లేదు. మరి ఏం చేయాలి? వాస్తవానికి ఇలాంటి విషయాల్లో సొంత వైద్యం ఏమాత్రం పనికిరాదు. ఎవరికి వారు పరీక్షలు చేయించుకుని, అనవసరంగా ఆందోళనకు గురికాకూడదు. వైద్యుల్ని సంప్రదించి, వాళ్లు సూచించిన పరీక్షలు చేయించుకుంటే.. అసలు గుండె సంబంధిత వ్యాధి ఉందో? లేదో? తెలుస్తుంది.
Heart Tests List : సాధారణంగా గుండె జబ్బు ఉందో? లేదో? చెప్పేందుకు ఈసీజీ, 2డీ ఎకో, ట్రెడ్ మిల్ టెస్ట్ చేస్తారు. వైద్య నిపుణులు ఈ పరీక్షల్లో చాలా అంశాల్ని పరిగణనలోకి తీసుకుని, ఆ తరువాత మాత్రమే ఓ అంచనాకు వస్తారు. అంతే తప్ప సొంతంగా పరీక్షలు చేయించుకుని, ఎలాంటి నిర్ధరణకు రాకూడదని వైద్యులు చెబుతున్నారు.
గుండె జబ్బులు ఉంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు?
Heart Problems Precautions And Treatment : ఎవరికైనా గుండె జబ్బు ఉంటే చాలా అప్రమత్తంగా ఉండాలి. వైద్యుల సూచనల మేరకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటికే ఒకటి లేదా రెండు సార్లు గుండె పోటు వచ్చినా లేదా శస్త్ర చికిత్స జరిగినా.. సదరు పేషెంట్లు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఒకసారి హార్ట్ ఎటాక్ వచ్చినంత మాత్రాన సదరు వ్యక్తి ఫిట్ కాదని భావించడానికి వీలులేదు. ఎందుకంటే గుండె కండరాలపై ఎటాక్ ఏ మేరకు ప్రభావం చూపించింది అనేది చాలా ముఖ్యం అవుతుంది.
గుండె సంబంధిత వ్యాధులు వచ్చినవారు.. షుగర్, బీపీ, కొలెస్ట్రాల్‌లను కంట్రోల్‌లో పెట్టుకోవాలి. నడిస్తే ఆయాసం వచ్చినా, ఇతర ఇబ్బందులు అనిపించినా వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి. వాస్తవానికి రెగ్యులర్ చెకప్ ద్వారా, సరైన జీవన విధానాన్ని అలవర్చుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. సరైన ఆహార నియమాలు పాటిస్తూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే సత్ఫలితాలు ఉంటాయి.