Drinking Water Before Sleep Is Good Or Bad : రాత్రిపూట భోజనం చేశాక నాలుగు అడుగులు నడిచి లేదంటే కాసేపు టీవీ చూసి నిద్రకు ఉపక్రమిస్తారు చాలామంది. అయితే నిద్ర పోవడానికి ముందు కొంచెం మంచినీళ్లు తాగి పడుకోవడం చాలామందికి అలవాటుగా ఉంటుంది. అయితే ఇలా రాత్రిపూట నిద్రపోయే ముందు నీళ్లు తాగడం అనేది అలవాటు ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటుగా హాని కూడా చేస్తుందని అంటున్నారు వైద్యులు.
నిద్రపోయే ముందు నీళ్లు తాగడం వల్ల శరీరానికి లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. అవేంటంటే..
నిద్రపోయే ముందు నీళ్లు తాగడం వల్ల కలిగే లాభాలు:
Advantages Of Drinking Water Before Sleep :
హైడ్రేషన్ బ్యాలెన్స్!
పగటిపూట మన శరీరం నీటిని కోల్పోతుంది. బాడీ తగినంత హైడ్రేటెడ్‌గా ఉండకపోవడం వల్ల అసౌకర్యానికి లోనవుతాము. దీంతో మీ నిద్ర దెబ్బతింటుంది. అయితే నిద్రపోయే ముందు నీళ్లు తాగడం వల్ల హైడ్రేషన్ సరిగ్గా బ్యాలెన్స్ అవుతుంది. దీంతో మీ నిద్ర సమస్య కూడా తీరిపోతుంది.
కండరాలకు మేలు!
పగటి పూట చేసే వ్యాయామం, వివిధ రకాల పనుల వల్ల మీ కండరాల మీద ఎక్కువగా ఒత్తిడి పడుతుంది. రాత్రి పడుకునే ముందు నీళ్లు తాగి పడుకుంటే కండరాలకు మేలు కలుగుతుంది. రాత్రి తాగే నీళ్లు అవి పునరుద్ధరణకు గురయ్యేలా చేస్తాయి. ఫలితంగా మరుసటి రోజు హుషారుగా ఉండటానికి వీలవుతుంది.
శరీర ఉష్ణోగ్రతలను నియంత్రిస్తుంది!
మనం నిద్రలోకి జారుకున్న వెంటనే సహజంగానే మన శరీర ఉష్ణోగ్రతలు పడిపోతాయి. అయితే నిద్రపోయే ముందు నీళ్లు తాగడం శరీర ఉష్ణోగ్రతలను నియంత్రించడంలో సహాయపడుతుంది. రాత్రిపూట మీ నిద్రకు భంగం కలిగించే ఓవర్ హీటింగ్‌ను కూడా అరికడుతుంది.
గురక మాయం!
డీహైడ్రేషన్ అనేది పొడి గొంతు, ముక్కు సంబంధిత ఇబ్బందులకు దారి తీస్తుంది. ఫలితంగా గురక పెడతారు. ఇది తేలికపాటి స్లీప్ ఆప్నియాకు దారితీస్తుంది. అలాంటి సమయాల్లో రాత్రి పడుకునే ముందు నీళ్లు తాగి పడుకుంటే ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు.
విశ్రాంతిని పెంపొందిస్తుంది!
నిద్రకు ముందు ఒక కప్ వేడి వేడి హెర్బల్ టీ లేదా గ్లాస్ మంచినీళ్లు తాగడం మీ శరీరంపై మంచి ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ అలవాటు వల్ల ఇది విశ్రాంతి తీసుకునే సమయం అని మీ శరీరానికి సిగ్నల్స్ అందుతాయి. ఇది మీ విశ్రాంతిని మెరుగుపరిచి హాయిగా నిద్రపట్టేలా చేస్తుంది.
పడుకునే ముందు నీళ్ల తాగడం వల్ల కలిగే నష్టాలు:
Disadvantages Of Drinking Water Before Sleep :
తరచూ మూత్రవిసర్జనకు లేవడం!
పడుకునే ముందు నీళ్లు తాగడం వల్ల ఉండే ప్రధాన ఇబ్బందుల్లో మూత్రవిసర్జన ఒకటి. ఇందుకోసం నిద్రలేవడాన్నే మెడికల్ పరిభాషలో నోక్టురియా అంటారు. ఇలా నిద్ర సమయంలో బాత్రూమ్కు వెళ్లాల్సి రావడం వల్ల నిద్రకు భంగం కలుగుతుంది. ఫలితంగా నిద్ర సరిపోక నీరసంగా అనిపిస్తుంటుంది.
గుండెల్లో మంట!
రాత్రిపూట నీళ్లు తాగే అలవాటున్న కొంతమందిలో గుండెల్లో మంట కలిగిన భావన రావచ్చు. పడుకునేటప్పుడు అడ్డంగా పడుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ యాసిడ్ సులువుగా అన్నవాహికలోకి వెనక్కి ప్రవహించవచ్చు. దీని వల్ల మీరు అసౌకర్యానికి గురవుతారు. ఫలితంగా ఇది మీ నిద్రను డిస్టర్బ్ చేస్తుంది.
శరీరానికి శ్రమ!
హైడ్రేటెడ్‌గా ఉండటం కోసం కొంతమంది రాత్రి పడుకునే ముందు ఎక్కువ నీళ్లు తాగుతుంటారు. దీని వల్ల సమస్యలు తలెత్తుతాయి. శరీరంలోకి చేరిన అధిక ద్రవాలను ప్రాసెస్ చేయడానికి శరీరంలోని వివిధ అవయవాలు పని చేయాల్సి వస్తుంది. రాత్రిపూట నిద్రకు, విశ్రాంతికి ఇది అవాంతరం కలిగిస్తుంది.
ఉబ్బరం సమస్య!
స్లీప్ ఆప్నియా సమస్య ఉన్నవారు పడుకునే ముందు ఎక్కువ నీళ్లు తాగితే పలు ఇబ్బందులకు గురికావచ్చు. ఎక్కువ మోతాదులో తీసుకునే నీళ్ల వల్ల శ్వాస మార్గాలు ఉబ్బరాన్ని కల్గించవచ్చు. ఫలితంగా నిద్రలో శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారవచ్చు.
మూత్రాశయం నిండినట్లు అనిపించడం!
నిద్రకు ముందు నీళ్లు తాగడం వల్ల మూత్రాశయం నిండిన భావన కలగవచ్చు. దీని వల్ల తరచూ బాత్రూమ్కు వెళ్లాల్సి వస్తుంది. ఇది మీ నిద్రను పాడు చేస్తుంది.
చివరగా.. రాత్రిపూట నిద్రకు ముందు నీళ్లు తాగడం అనేది ఒక్కొక్కరి శరీరతత్వం మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కువ నీటిని కాకుండా శరీరం హైడ్రేటెడ్‌గా ఉండేందుకు నీళ్లు తీసుకుంటే సరిపోతుంది. రాత్రిపూట ఎక్కువ కారం లేదంటే ఎక్కువ తీపి, మసాలా ఉండే ఆహారాలు తినకపోవడం ఉత్తమం. దీని వల్ల ఎక్కువ నీళ్లు తాగాల్సిన అవసరం ఏర్పడదు.