కొవిడ్ -19 మహమ్మారితో పోరాడటానికి, తిరిగి సాధారణ పరిస్థితులను పునరుద్ధరించడానికి టీకా అత్యంత ప్రభావవంతమైన సాధనం. భారత్లో కొవిడ్ -19 టీకా డ్రైవ్ మొదటి రోజు నుంచి ఊపందుకుంది. పౌర సంస్థలు అందిస్తున్న ఉత్సాహంతో నెమ్మదిగా అయినా స్థిరంగా లక్ష్యాలను చేరుకుంటున్నాం. ప్రజారోగ్య రంగంలోని వారికి, పారిశుద్ధ్య కార్మికులకు టీకాలు ఇచ్చే కార్యక్రమం విజయవంతమైన తరువాత 60 ఏళ్లు పైబడిన వారికి, 45 ఏళ్లు పైబడి ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్నవారికి టీకాలు వేయడం ప్రారంభించాం.
మీరు వ్యాక్సిన్ తీసుకోవడానికి, మీ ఆప్తులకు, కుటుంబ సభ్యులకు టీకాలు వేయించడానికి ఈ మార్గదర్శకాలు గుర్తుంచుకోండి:
1. పెద్దవారందరూ కొవిడ్ -19 టీకా తీసుకొని, ఇతరులను కూడా ప్రోత్సహించాలి.
2. ఆహారంతో పాటు బాగా నీటిని తీసుకుని టీకా వేయించుకోవాలి.
3. టీకా లేదా టీకాలోని రసాయనాల పట్ల అలెర్జీ ఉన్నవారు వ్యాక్సిన్ తీసుకోకూడదు.
4. కొవిషీల్డ్, కొవాగ్జిన్... ఆమోదం పొందిన టీకాలు. వీటిని ఎలాంటి సందేహం లేకుండా తీసుకోవచ్చు.
- కొవిడ్ -19 వల్ల మరణం సంభవించకుండా 100% సమర్ధతతో ఈ టీకా కాపాడగలదు.
- మహమ్మారి కొవిడ్ -19 కు వ్యతిరేకంగా పనిచేయడంలో ఇవి సమర్థవంతమైనవి.
- కొవిడ్ –19 రోగ లక్షణాలకు వ్యతిరేకంగా పనిచేయటంలో 60-95% సమర్థత కలిగినవి.
- లక్షణాలు కనిపించని కొవిడ్ -19 విషయంలో మాత్రమే వీటి సామర్థ్యం కొద్దిగా తక్కువ.
5. కొవిడ్ ముప్పు ఉన్న 60 ఏళ్లు పైబడిన వారిలో, దీర్ఘకాల ఆరోగ్య సమస్యలుండి 45 సంవత్సరాలు దాటిన వారిలో ఈ టీకా వల్ల కొవిడ్ మరణాల శాతం బాగా తగ్గుతుంది. కొవిడ్ సోకి మరణించే 90% మందిలో ఈ రెండు వర్గాలకు చెందిన వారే ఉన్నారు.
6. కొవిడ్ -19 వ్యాధి బారిన పడి కోలుకున్న వారు 8-12 వారాల తర్వాత మాత్రమే వ్యాక్సిన్ తీసుకోవాలి.
7. ప్లాస్మా థెరపీ ద్వారా కొవిడ్ -19 చికిత్స పొందిన వారు టీకా తీసుకోడానికి 8-12 వారాల సమయం వేచి చూడాలి.
8. రక్తపోటు, డయాబెటిస్, మూత్రపిండ వైఫల్యం, గుండె జబ్బులు ఉన్న రోగులలో కూడా కొవిడ్ టీకా సురక్షితం. బైపాస్, యాంజియోగ్రఫీ చేయించుకున్నవారు, డయాలసిస్ చేయించుకుంటున్న వారు కూడా వ్యాక్సిన్ తీసుకోవచ్చు.
9. గర్భిణీల విషయంలో పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకోవాలి. కరోనాపై ముందు వరుసలో ఉండి పోరాడే రంగాల్లో పనిచేసే గర్భిణీ కచ్చితంగా టీకా తీసుకోవాలి.
10. టీకా అనంతరం గర్భధారణ ఎంతకాలం కూడదనే విషయంపై స్పష్టమైన సమాచారం లేదు. అయినప్పటికీ, ఈ టీకాలో ఉన్నది ఇన్యాక్టివేటెడ్ వైరస్ కాబట్టి ఎలాంటి నష్టం కలగదు. కానీ టీకా తరువాత గర్భం ధరించడానికి 6-8 వారాల కనీస కాల పరిమితి తీసుకోవటం మంచిది.
11. ఆహారంలో కొన్ని దినుసులు, కొన్ని ఔషధాల పట్ల అలెర్జీ ఉన్న వారూ టీకా తీసుకోవచ్చు. అలాగే ఉబ్బసం, ఇతర శ్వాస కోశ సమస్యలు, స్కిన్ అలెర్జీ వంటివి ఉన్నవారికీ టీకా సురక్షితమే. అయినా టీకా తీసుకునేముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది.
12. ఆస్పిరిన్, క్లోపిడోగ్రెల్ వంటి రక్తాన్ని పలుచన చేసే మందులను వాడేవారు వాటిని ఆపకుండా కొవిడ్ -19 వ్యాక్సిన్ తీసుకోవచ్చు.
13. వార్ఫరిన్ లేదా ఇతర రక్త స్కందన ఔషధాలు తీసుకునే వారికి టీకా వేసిన చోట వాపు కలగవచ్చు. అందువల్ల టీకా వేసుకునే రోజు అ ఔషధాలు మానేయవచ్చు.
14. పార్కిన్సన్స్, ఇతర నాడీ జబ్బులతో బాధపడుతున్న వారికి కూడా ఈ టీకా సురక్షితం.
15. అవయవ మార్పిడి చేయించుకున్నవారిలో రోగ నిరోధక శక్తి తగ్గించే ఔషధాల వల్ల కొవిడ్ టీకా ప్రభావం కొద్దిగా తక్కువ ఉండవచ్చు. టీకా తీసుకునేముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది.
16. టీకా తరువాత మద్యం తీసుకోకూడదన్నది ఒక అపోహ మాత్రమే. అలాగే ఈ టీకా వల్ల శరీరంలో శక్తి, లైంగికాసక్తి సన్నగిల్లదు. డీఎన్ఏను కూడా ఇది మార్చలేదు.
17. 18 ఏళ్ల వయసు లోపు పిల్లలకు వ్యాక్సిన్ ఇవ్వక్కర్లేదు. దీనిపై ఇంకా అధ్యయనాలు జరపాల్సి ఉంది.
18. కీమో థెరపీ తీసుకుంటున్న క్యాన్సర్ రోగులు టీకా వేసే సమయం కోసం వైద్యులను సంప్రదించాలి. కీమో థెరపీ మోతాదు తరువాత కనీసం నాలుగు వారాలు ఆగి టీకా వేయించుకోవాలి.
19. టీకా వేసుకున్న తర్వాత జ్వరం, ఒళ్లు నొప్పులు, తల నొప్పి, కళ్లు తిరగటం కలగవచ్చు.
20. అవసరమైనపుడు పారాసిటమాల్ మాత్ర వేసుకుంటే పై లక్షణాలన్నీ తొలగిపోతాయి.
సరైన సమాచారం కోసం టీకా కేంద్రాలలో వైద్యులను సంప్రదించాలి. వదంతులను నమ్మరాదు. టీకా ద్వారా చేకూరే వ్యాధి నిరోధక శక్తి మన సహజ శక్తి కంటే ముఖ్యమైనది. కొవిడ్ వైరస్ను ఎదుర్కోవడానికి ఇదొక్కటే మార్గం. మనందరం కలసి ఐకమత్యంగా ఈ మహమ్మారిని జయిద్దాం.