కోవిడ్ 19 టీకా సిద్ధమవడం వల్ల యావత్ ప్రపంచం ఊపిరి పీల్చుకుంది. భారత ప్రభుత్వం 2021 జనవరి 16న ప్రపంచంలో అతి పెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించింది. ముందుగా ఆరోగ్య సిబ్బందికి.. తరువాత 50 ఏళ్లు పైబడిన వారికి.. 50 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారిలో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న వారిని లక్ష్యంగా పెట్టుకుని టీకా ఇవ్వాలని నిర్ణయించారు. తొలుత ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన ఆరోగ్య సిబ్బందికి టీకా కార్యక్రమం విజయవంతంగా సాగుతోంది. కేవలం రెండు వారాల్లోనే 33 లక్షల మందికి టీకా ఇచ్చారు. యూఎస్‌ఏ, యూకే, ఇజ్రాయెల్ లాంటి అభివృద్ధి చెందిన దేశాల కన్నా వేగంగా టీకా పంపిణీ వేగంగా జరిగినట్లు నిపుణులు భారతపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇంత వరకు బాగానే ఉన్నా.. కొన్ని చోట్ల వ్యాక్సిన్ నిల్వలు పెరుగుతున్నాయి. కొన్ని సర్వేల ప్రకారం అనేక రాష్ట్రాల్లో టీకా తీసుకోవడానికి చాలా మంది జంకుతున్నట్లు తెలుస్తోంది. ఈ ధోరణి ఆరోగ్య సిబ్బందిలోనూ ఉంది. కోవిడ్ నియంత్రణకు, ప్రజల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి టీకా తోడ్పడుతుంది.
సంకోచం ఈనాటిది కాదు..
అనేక ప్రమాదకర వ్యాధుల నుంచి ప్రపంచాన్ని రక్షించిన ఒక ముఖ్యమైన శాస్త్రీయ ఆవిష్కరణ టీకా. 1796 లో మశూచి వ్యాధికి వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన ఎడ్వర్డ్ జెన్నర్ కాలం నుంచి టీకాల పట్ల అపనమ్మకం, ఎన్నో సందేహాలు ప్రజల మదిలో ఉన్నాయి. ఇటీవల, చాలా దేశాల్లో ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాల్లోనే గవద బిళ్ల(మీజిల్స్)ల వ్యాధికి టీకాలు తీసుకోవడానికి ప్రజలు సంకోచిస్తున్నందువల్ల ఈ జబ్బు ప్రపంచవ్యాప్తంగా 30శాతం పెరిగింది.
ప్రపంచ ఆరోగ్యానికి పొంచి ఉన్న 10 ప్రమాదాల్లో టీకాల పట్ల నిరాసక్తత ఒకటిగా మారింది. భారత్ లోనూ టీకాల పట్ల ఉన్న సందేహాలు, నిరాసక్తత ఈనాటివి కావు. 20వ శతాబ్ధ ప్రారంభంలో ప్రబలిన కలరా, ప్లేగు వ్యాధుల నుంచి ఇటీవలి కాలంలో పోలియో, హెచ్.పి.వి. టీకాల వరకు ఈ ఆలోచనలు ఆరోగ్య ఉద్యమాన్ని ప్రభావితం చేస్తూనే ఉన్నాయి.
టీకాలు లభిస్తున్నా తీసుకోవడానికి ఆసక్తి చూపకపోవడానికి కొన్ని సాంస్కృతిక, సామాజిక, మతపరమైన కారణాలు ఉండవచ్చు. టీకాల వల్ల లాభం కన్నా నష్టం ఎక్కువనే నమ్మిక కూడా ఒక కారణం.
ఇదే పరిష్కారం..
టీకా వల్ల వ్యాధిని అరికట్టడమే కాకుండా పెద్ద సంఖ్యలో ప్రజలు టీకాలు తీసుకుంటే అందరిలో వ్యాధిక్షమత్వ శక్తి పెరుగుతుందని శాస్త్రీయ ఆధారాలున్నాయి. అందువల్ల ప్రతి వ్యక్తి టీకా తీసుకోవడం ఒక సామాజిక బాధ్యతగా పరిగణించాలి. ఈ సందేశాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. ఇందుకోసం అనేక రంగాల వారి సహకారాన్ని తీసుకుంటూ బహుముఖ ప్రణాళికను అమలు చేయాలి. ఇందుకు పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు.
- టీకా తీసుకోవడం చాలా సులభం. ఇందుకు ఎక్కువ సమయం అవసరం లేదు.
- టీకాలపై నమ్మకం కలిగించడానికి ఆ ప్రాంత/సంస్కృతికి చెందిన సందేహలను తీర్చుతూ.. సమాధానాలు చెబుతూ అందరినీ కలుపుకొని ముందుకు సాగాలి.
- టీకాల గురించి బహిరంగంగా, పారదర్శకంగా సమాచారం ఇచ్చి పుచ్చుకోవడం, చర్చలు జరపడం అవసరం. టీకాలు చేసే లాభాల గురించి, టీకాలు తీసుకోకపోవడం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలి.
- పుకార్లు, తప్పుడు సమాచారం వల్ల టీకాలను ప్రజలు వ్యతిరేకించవచ్చు. వాటిని సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి ఒక కార్యాచరణను అమలు చేయాలి.
- ప్రజల్లో భయాందోళనలు తొలగించడంలో వార్తా మాధ్యమాలు ముఖ్య భూమిక పోషించాలి. అపోహలను తొలగించి, సరైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు అందజేయాలి.
- ఇంటర్నెట్, సామాజిక మాధ్యమాలు ప్రజలకు ముఖ్యమైన సమాచార సాధనాలుగా మారాయి. సామాజిక మాధ్యమాలు వేదికగా ప్రజారోగ్య నిపుణులు తప్పుడు ప్రచారాన్ని గుర్తిస్తూ.. ప్రజలకు సరైన సమాచారాన్ని చేరవేసేలా కృషి చేయాలి.
- టీకాలపై ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించడం చాలా ముఖ్యం. సామాన్య ప్రజలను టీకాలు తీసుకోవడానికి ప్రేరేపించేలా పలు సంఘాల నాయకులను ఈ కార్యక్రమంలో నిమగ్నం చేయించాలి.
- టీకా తీసుకున్న తరువాత అనుకోకుండా కలిగే విపత్తులను, ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవటానికి ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ సిద్ధంగా ఉండాలి.
- వ్యాధి నిరోధక శక్తి బలహీనంగా ఉన్న వారికి, ఇతరత్రా బలహీన వర్గాల వారికి టీకాలు అందజేయడంలో స్థానిక వనరులను వినియోగించుకోవాలి.
- టీకాలు అందించిన తర్వాత వ్యాధి ప్రబలకుండా తీసుకునే జాగ్రత్తలు (మూతి ముసుగులు ధరించడం, భౌతిక దూరం పాటించడం) కొనసాగించాలి.