గుండెపోటు, పక్షవాతం ముప్పు అధికంగా గలవారికి డాక్టర్లు తక్కువ మోతాదు ఆస్ప్రిన్ మాత్రలను సూచిస్తారు. ఇవి రక్తాన్ని పలుచగా చేస్తూ, రక్తం గడ్డలు ఏర్పడకుండా కాపాడతాయి. వీటితో పాటు నైట్రిక్ ఆక్సైడ్ మీదా దృష్టి పెట్టడం మంచిది. ఇది రక్తనాళాల సంకోచ, వ్యాకోచ ప్రక్రియ సజావుగా సాగేలా చేస్తుంది. దీంతో రక్తపోటు తగ్గుతుంది. ఫలితంగా గుండె ఆరోగ్యమూ ఇనుమడిస్తుంది. కాబట్టి నైట్రేట్లతో కూడిన పదార్థాలను ఆహారంలో చేర్చుకుంటే బావుంటుంది. నైట్రేట్లు శరీరంలోకి ప్రవేశించాక నైట్రిక్ ఆక్సైడ్‌గా మారతాయి.
మనం తరచూ తినే పాలకూరలో నైట్రేట్లు ఎక్కువగా ఉంటాయి. 100 గ్రాముల పాలకూరలో 24-387 మి.గ్రా. నైట్రేట్ ఉంటుంది. క్యారెట్లూ తక్కువేమి కాదు. 100 గ్రాములతోనే 92-195 మి.గ్రా. నైట్రేట్లు లభిస్తాయి. దొరికితే ఆవాల ఆకులూ తీసుకోవచ్చు. వంద గ్రాముల ఆకుల్లో 70-95 మి.గ్రా. నైట్రేట్లు ఉంటాయి. ఇక కూరగాయల్లో వంద గ్రాముల వంకాయలతో 25-42 మి.గ్రా. నైట్రేట్లు పొందొచ్చు. వెల్లుల్లి సంగతి సరేసరి. ఇది ఒంట్లో నైట్రిక్ ఆక్సైడ్ తయారీని ఉత్తేజితం చేస్తుంది. బత్తాయి, నారింజ వంటి పుల్లటి పండ్లూ మేలు చేస్తాయి. వీటిల్లోని విటమిన్-సి మన శరీరం నైట్రిక్ ఆక్సైడ్‌ను గ్రహించుకోవటానికి తోడ్పడుతుంది. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లతో యాంటీ ఆక్సిడెంట్లూ లభిస్తాయి. ఇవి రక్తనాళాల లోపలి పైపొర ఆరోగ్యంగా పనిచేయటానికి దోహదం చేస్తాయి. ఇది మరో ప్రయోజనం.
ఇదీ చదవండి: నూతన సంవత్సరానికి 'కొత్త'గా బాసించాలంటే..