కరోనా సోకితే మొదటి 2-4 రోజుల తర్వాత జ్వరం, పొడిదగ్గు, జలుబు మొదలై క్రమంగా శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. విరేచనాలు అవుతాయి. ఇవి కొవిడ్-19ను గుర్తించడానికి ప్రాథమిక లక్షణాలు. వీటికి అదనంగా అకస్మాత్తుగా వాసన గ్రహించే శక్తి కోల్పోవడం అనే సంకేతమూ చేరినట్లు బ్రిటన్‌కు చెందిన విజ్‌మన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పరిశోధకులు చెబుతున్నారు. వీరు ఇజ్రాయెల్‌కు చెందిన ఎడిత్ వూల్ఫ్‌సన్ మెడికల్ సెంటర్‌తో కలిసి.. వాసన చూసే శక్తిని పసిగట్టే పరికరాన్ని కనుగొన్నారు.
మనం నిత్యం వాడే టూత్‌పేస్టు, మసాలాలు, పప్పు దినుసులు, పుల్లటి వస్తువులతో కూడిన మొత్తం అయిదు రకాల పదార్థాల వాసనలను ఆధారంగా చేసుకుని తయారుచేసిన పరికరంతో 5 నిమిషాల్లో ఎవరికి వారుగా పరీక్ష చేసుకోవచ్చని విజ్‌మన్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధకులు చెప్పారు. చైనా, ఫ్రాన్స్, స్పెయిన్, ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల్లోని బాధితుల రిపోర్టులను పరిశీలించగా 60% మంది వాసన గ్రహించే శక్తి కోల్పోయినట్లు తెలిపారు. ఈ పరికరంతో కరోనా ముప్పును ముందే గుర్తించే వీలుందన్న చర్చ ఊపందుకుంది.