కరోనా వైరస్ కాస్త పెద్దగా ఉంటుంది. ఇది 5 మైక్రాన్ల సైజు కన్నా పెద్ద తుంపర్లతోనే వ్యాపిస్తుంది. ఇప్పటివరకూ మనం భావిస్తున్నది ఇదే. ఇతరులకు దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలు తీసుకుంటున్నదీ దీని ఆధారంగానే. కానీ ఇది మాట్లాడుతున్నప్పుడు, శ్వాస వదిలినప్పుడు వెలువడే సూక్ష్మ తుంపర్లతోనూ వ్యాపిస్తున్నట్టు తేలటం కలకలం సృష్టిస్తోంది. సాధారణంగా పెద్ద తుంపర్లు బరువుగా ఉంటాయి కాబట్టి గురుత్వాకర్షణ శక్తి ప్రభావంతో త్వరగా కింద పడిపోతాయి. రెండు మీటర్ల కన్నా ఎక్కువ దూరం వెళ్లలేవు. అదే 5 మైక్రాన్ల కన్నా తక్కువ సైజు తుంపర్లు తేలికగా ఉంటాయి. ఇవి చాలాసేపు గాల్లో అలా తేలియాడుతూనే ఉంటాయి. చుట్టుపక్కల ఉన్నవాళ్లు వీటిని పీల్చితే వాటిల్లోని వైరస్ ఒంట్లోకి వెళ్లే ప్రమాదముంది.
గాలి ద్వారా సోకటమంటే ఇదే. ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నదీ ఇదే. కరోనా వైరస్ సూక్ష్మ తుంపర్లలోనూ, అదీ ఇన్‌ఫెక్షన్ కలగజేసే స్థాయిలోనూ ఉంటోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తుండటమే దీనికి కారణం. జనసమ్మర్ధ ప్రాంతాల్లో, గాలి అంతగా ఆడని చోట్ల కరోనా గలవారితో ఎక్కువసేపు గడిపితే గాలి ద్వారా వైరస్ సోకే అవకాశం లేకపోలేదని ప్రపంచ ఆరోగ్యసంస్థ దీన్ని కొంతవరకు సమర్థించింది కూడా. నిజానికి సూక్ష్మ తుంపర్లతో కరోనా వ్యాపించొచ్చన్నది కొత్త సంగతేమీ కాదు. కరోనా బాధితులకు శ్వాసనాళంలోకి గొట్టాన్ని అమర్చటం వంటి చికిత్సలు చేస్తున్నప్పుడు వెలువడే సన్న తుంపర్లలోని వైరస్ గాలిలో కలవొచ్చని, అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రపంచ ఆరోగ్యసంస్థ మొదట్లోనే పేర్కొంది. ఇది ఆసుపత్రులకే పరిమితం కావటం లేదని.. గాలి అంతగా ఆడని ఇళ్లు, భవనాలు, కార్యాలయాల్లోనూ ఇలాంటి ప్రమాదం పొంచి ఉంటోందన్నదే కొత్త విషయం. కరోనా బాధితులకు సన్నిహితంగా లేకపోయినా కొందరు ఇన్‌ఫెక్షన్ బారినపడుతున్నట్టు చైనా, అమెరికాలోని కొన్ని ఉదంతాలూ స్పష్టం చేస్తున్నాయి. కరోనా బాధితులు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వెలువడే పెద్ద తుంపర్లతోనే కాదు.. మాట్లాడినప్పుడు, శ్వాస వదిలినప్పుడు వెలువడే ఆవిరిలాంటి సన్న తుంపర్లతోనూ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తోందనే ఇవి సూచిస్తున్నాయి. గాలిలో తేలియాడే కరోనా సూక్ష్మ తుంపర్లు 6-9 అడుగుల దూరం వరకు ప్రయాణించొచ్చని భావిస్తున్నారు. అవి చుట్టుపక్కల వస్తువుల మీదా అంటుకోవచ్చు. సూక్ష్మ తుంపర్లతో కూడిన గాలిని ఎవరైనా పీల్చుకున్నా.. అవి అంటుకున్న చోట తాకిన చేత్తో ముక్కు, కళ్లు, నోరు ముట్టుకున్నా వైరస్ ఒంట్లోకి ప్రవేశించొచ్చు. ఇవి ఎంతవరకు ఇన్‌ఫెక్షన్ కలగజేస్తాయన్నది కచ్చితంగా తెలియకపోయినప్పటికీ ఎవరి జాగ్రత్తలో వారుండటం ఎంతైనా అవసరం.
గాలితోనే తరమాలి!
ముల్లును ముల్లుతోనే తీయాలంటారు. గాలితో వచ్చే కరోనాను గాలితోనే తరమాలి! ఇళ్లు, భవనాలు, కార్యాలయాల్లో గాలి బాగా ఆడేలా చేస్తే దీన్ని తరిమేయటం కష్టమేమీ కాదు. కరోనా నివారణ కోసం ఇతరులకు దూరంగా ఉండటం, ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు మాస్కు ధరించటం, తరచూ సబ్బుతో చేతులను కడుక్కుంటే చాలని ఇప్పటివరకు భావిస్తున్నాం. ఇవి మాత్రమే సరిపోవు. భవనాల్లోకి గాలి ధారాళంగా వచ్చి పోయేలా చూసుకోవటం ఎంతైనా అవసరం. తలుపులు, కిటికీలు తెరచి ఉంచాలి. వీలైతే లోపలి గాలిని బయటకు పంపించే ఎగ్జాస్ట్ ఫ్యాన్లు వాడుకోవాలి. దీంతో సూక్ష్మ తుంపర్లతో కూడిన గాలితో పాటు వైరస్ బయటకు వెళ్లిపోతుంది. గాలి, వెలుతురు బాగా వచ్చే చోట్ల వైరస్‌ల వంటి సూక్ష్మక్రిములు ఎంతోసేపు జీవించి ఉండలేవు కూడా. త్వరగా నిర్వీర్యమై పోతాయి.
- ఎక్కువమంది ఒకేచోట గుమిగూడకుండా చూసుకోవాలి. లిఫ్టులు వాడకపోవటమే ఉత్తమం. తప్పనిసరైతే లిఫ్టుల్లో ఎగ్జాస్ట్ ఫ్యాన్లు విధిగా అమర్చుకోవాలి.
ఇతరుల గాలిని పీల్చొద్దు
ఒకరు వదిలిన గాలిని మరొకరు పీల్చకుండా చూసుకోవటమూ చాలా కీలకం. ఇందుకు మాస్కులు బాగా ఉపయోగపడతాయి. వీటి విషయంలో అలసత్వం అసలే పనికిరాదు. కరోనా ఇన్‌ఫెక్షన్ ఉన్నా చాలామందికి లక్షణాలే ఉండటం లేదు. పరీక్ష చేస్తే గానీ వైరస్ బయటపడటం లేదు. అందువల్ల అందరినీ కరోనా ఉందనే దృష్టితోనే చూడాలి. ప్రతి ఒక్కరూ, ఎల్లవేళలా మాస్కు ధరించాలి. ఆఫీసుల్లోనే కాదు, ఇంట్లోనూ మాస్కు పెట్టుకోవటం అలవాటు చేసుకోవాలి. మాస్కుల గురించి కొత్తగా చెప్పుకోవటానికేముందని అనుకోవద్దు. వీటిని సరైన విధంగా ధరించటం మనందరి కర్తవ్యమని భావించాలి.
- చిన్న మాస్కులు ధరించొద్దు. ముక్కు, నోరు, గదమ కింది భాగం పూర్తిగా కప్పేసే మాస్కులనే పెట్టుకోవాలి.
- మాస్కు నాణ్యమైనదై ఉండాలి. గుడ్డ మాస్కులు మంచివే గానీ కరోనా బాధితుల సమక్షంలో వీటితో లభించే రక్షణ అంతంతే. ఆసుపత్రులకు వెళ్లినా, కరోనా బాధితులకు సేవ చేస్తున్నా విధిగా సర్జికల్ మాస్కులు వేసుకోవాలి. వీటిల్లో మూడు పొరలుంటాయి. బయటిపొర తేమ, దుమ్ము ధూళిని.. మధ్య పొర గాలిని శుద్ధి చేసి వైరస్‌ను అడ్డుకుంటాయి. లోపలి పొర చెమట, తడిని పీల్చుకొని అసౌకర్యం కలగకుండా చూస్తుంది.
- నూటికి 90% మంది తరచూ మాస్కును తీస్తుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మాస్కు ముందుభాగాన్ని చేత్తో తాకకూడదు. దీని ముందు భాగాన వైరస్‌ల వంటి సూక్ష్మక్రిములు పెద్దమొత్తంలో ఉంటాయి. మాస్కును ముట్టుకుంటే ఇవి చేతికి అంటుకుంటాయి. అదే చేత్తో కళ్లను, ముక్కును రుద్దుకుంటే వైరస్ ఒంట్లోకి ప్రవేశిస్తుంది. చేయిని ఆనించిన వస్తువుల అన్నింటి మీదా వైరస్ అంటుకుంటుంది. ఇక మాస్కుతో ఒరిగే ప్రయోజనమేంటి? లాభం కన్నా నష్టమే ఎక్కువ.
- గుడ్డ మాస్కులను రోజూ శుభ్రంగా సబ్బుతో ఉతుక్కోవాలి. లేదా బ్లీచింగ్ పొడి కలిపిన నీటిలో నానబెట్టి, ఆరబెట్టుకోవాలి.
ఇదీ చూడండి:మరోసారి రాజస్థాన్ సీఎల్పీ భేటీ.. కొలిక్కిరాని బుజ్జగింపులు