Best Tips to Overcome Breakup Pain : "శత్రువు విసిరిన కత్తికన్నా.. స్నేహితుడు విసిరిన కత్తికి పదునెక్కువ" నమ్మక ద్రోహాన్ని అడ్రెస్ చేసే అల్టిమేట్ లైన్ ఇది. ప్రేమ విషయానికి వస్తే.. దీని తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. మిత్రుడి గాయం త్వరగా మానిపోవచ్చు.. కానీ ప్రేమ చేసిన గాయం మాత్రం అంత త్వరగా మానిపోదు. ప్రేమలో ఎంత గాఢంగా మునిగితే.. బ్రేకప్ గాయం అంత తీవ్రంగా ఉంటుంది. అది మానడానికి కొందరిలో నెలలు పడితే మరికొందరిలో సంవత్సరాలు కూడా పడుతుంది! అయితే.. ఆ ఘటనను మనం ఎలా తీసుకుంటున్నాం? ఎలా అర్థం చేసుకుంటున్నాం? అన్నదాన్నిబట్టే.. బ్రేకప్ వేదనలోంచి బయటపడే సమయం ఆధారపడి ఉంటుంది. మీక్కూడా ఈ దెబ్బ తగిలిందా? ఆ బాధలోంచి తేరుకోలేకపోతున్నారా? అయితే.. ఇది మీకోసమే.
వాస్తవాన్ని అర్థం చేసుకోండి..
మీరు ప్రేమించిన వ్యక్తి ఇప్పుడు మీ జీవితంలో లేరు. ఇకపై రారు. ఇదే వాస్తవం. దీన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ ఊహనే హృదయం తీసుకోలేకపోతోందా? అది నిజమే కానీ.. ఇదే వాస్తవం. ఊహ వేరు.. వాస్తవం వేరు. వాస్తవమే జీవితం. ఇందులోకి మీరు వచ్చి తీరాల్సిందే. రేపటి ఉదయం మీకోసం ఎదురు చూస్తోంది. మూవ్ ఆన్ అయిపోవాల్సిందే. ఇది మీకు అర్థమైతే.. మిమ్మల్ని ఓదార్చడానికి మరెవరూ అవసరం లేదు. బ్రేకప్ బాధనుంచి బయటపడడానికి మరేం చేయాల్సిన పనిలేదు. ఒకవేళ సాధ్యం కావట్లేదు అంటే.. మరికొన్ని పనులు చేయాలి.
ఏడ్చేయండి..
వింతగా అనిపిస్తోందా? కానీ.. బాధను తగ్గించుకోవడానికి అద్భుతమైన మెడిసిన్ ఇది. బాధమొత్తం బయటకు వెళ్లిపోవాలంటే.. ది బెస్ట్ మార్గం ఇది. నమ్మండి.. మనసులో ఉన్న వేదన మొత్తం కన్నీళ్లు కాల్వల్లో పడి కొట్టుకుపోతుంది. బాధను అనుచుకుంటే.. లోపలే దాచుకుంటున్నారని అర్థం. మనసారా ఏడ్చేయండి. కన్నీళ్లను ఏమాత్రం దాచుకోవద్దు. ఒక రోజు.. రెండు రోజులు.. మూడో రోజు ముగించేయండి. కన్నీళ్లతో ఆ బాధకు "నీళ్లు" వదిలేయండి.
బాధను షేర్ చేసుకోండి..
మీరు ఒంటరిగా ఫుల్లుగా ఏడ్చేసిన తర్వాత కూడా.. ఇంకొంత బాధ గుండెల్లో మిగిలే ఉంటుంది. దాన్ని మీ ఇంట్లో ఇష్టమైన వాళ్లు.. మిమ్మల్ని బాగా ప్రేమించే వాళ్లతో షేర్ చేసుకోండి. బెస్ట్ ఫ్రెండ్స్‌తో పంచుకోండి. ఏడుపు తర్వాత బాధను మరిచిపోయే అద్భుతమైన మందు షేర్ చేసుకోవడం. మీ ప్రేమ కథ మొత్తం వారితో చెప్పుకోండి. ఈ క్రమంలో అవసరమైతే.. వారిని హత్తుకొని మళ్లీ గట్టిగా ఏడ్చేయండి. అలా.. మిగిలిన బాధను కూడా పూర్తిగా బయటకు వెళ్లగొట్టండి. మీ ప్రేమ తాలూకు గిఫ్టులు వంటివి ఏవీ మీ వద్ద కనిపించకుండా తీసిపారేయండి.
ఇంటి నుంచి బయటకు..
బ్రేకప్ అయినవాళ్లు సింగిల్ ఉండడం మంచిది కాదు. నిత్యం ప్రేమ జ్ఞాపకాలు కాల్చేస్తుంటాయి. కాబట్టి.. మీరు ఎవరో ఒకరితో కలిసి ఉండాలి. లేదంటే.. ఏదైనా నచ్చిన పనిలో పడిపోవాలి. మీకు ఇష్టమైన బ్యాడ్మింటన్, క్రికెట్, మరొకటి.. ఏది ఇష్టమైన గేమ్ అయితే.. దానికోసం తప్పకుండా గ్రౌండ్‌కు వెళ్లిపోవాలి. మీ అంత మీరు వెళ్లలేరు. పోవాలని అనిపించదు. అప్పుడు మీ బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకోండి. ఆటలే కాకుండా.. మీకు నచ్చిన ఇతర పనులు ఏవైనా సరే.. అవి చేసేయండి.
మీ భార్యాభర్తల మధ్య గొడవలు వస్తున్నాయా? ఈ సూచనలు పాటిస్తే బంధం స్ట్రాంగ్ అవుతుంది!
టూర్ ప్లాన్ చేయండి..
మీ ప్రేమ జ్ఞాపకాలు కనిపించని.. వినిపించని చోటుకు వెళ్లడానికి ప్లాన్ చేయండి. ఈ సమయంలో మీ వెంట మిమ్మల్ని అర్థం చేసుకునేవారు, మిత్రులు వెంట ఉండేలా చూసుకోండి. సింగిల్ గా వెళ్లొద్దని గుర్తుపెట్టుకోండి. అంతేకాదు.. గతంలో వెళ్లొచ్చిన ప్రాంతాలకు అస్సలే వెళ్లకూడదు. తెలిసిన చోటుకు వెళ్తే కొత్తగా చూడటానికి ఏమీలేక ఆసక్తి తగ్గుతుంది. మళ్లీ ప్రేమ విషయాలు గుర్తొస్తాయి. కాబట్టి.. కొత్త ప్రాంతాలకు వెళ్లండి. తప్పకుండా రిలీఫ్ అవుతారని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.
చివరగా..
బ్రేకప్ కావడానికి కారణం మీ ఇద్దరిలో ఎవరైనా కావొచ్చు. అది జరిగిపోయింది. మీ ప్రేమ ఛాప్టర్ క్లోజ్ అయ్యిందన్న విషయాన్ని మీరు గుర్తించాలి. మీతో విడిపోయి ఉండడానికి మీ పార్ట్నర్ సిద్ధమైనప్పుడు.. మీరెందుకు ఉండలేరు? నిజాన్ని అర్థం చేసుకోండి.. వాస్తవంలోకి రండి. తద్వారానే.. సాధ్యమైనంత త్వరగా మీ బ్రేకప్ బాధ నుంచి బయటపడగలరని మానసిక నిపుణులు చెబుతున్నారు.
Tips For Dating to Marriage: డేటింగ్ చేస్తున్నారా..? ఈ విషయాలు అస్సలు మరిచిపోవద్దు!