Best Tips For Children Study At Home : పిల్లలు బాగా చదువుకొని ఉన్నత స్థానంలో ఉండాలని ప్రతి తల్లిదండ్రులూ కోరుకుంటారు. ఇందుకోసం మంచి స్కూళ్లలో జాయిన్ చేస్తారు. అలాగే మార్కులు, ర్యాంకులు తెచ్చుకోవడానికి ట్యూషన్‌లలో చేర్పిస్తుంటారు. అయితే.. పిల్లలు ఇంటికి వచ్చిన తరువాత వారికి చదువుకోవడానికి అనువైన వాతావరణం కల్పించకపోతే.. ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని.. చదువులో వెనకబడే ఛాన్స్ ఉందని నిపుణులు అంటున్నారు. మరి.. చదువు కోసం పిల్లలకు ఎటువంటి వాతావరణం కల్పించాలి? పరీక్షల సమయంలో పిల్లలు ఒత్తిడిని జయించడంలో ఎలా సహకరించాలి? అనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
Tips For Children Study At Home : బాగా చదువుకోవాలని పిల్లలకు చెబుతారుకానీ, ఇంట్లో వారు చదువుకోవడానికి అనువైన వాతావరణం ఉందా లేదా అనేది చూసుకోరు చాలా మంది పెద్దలు! పిల్లలే కదా.. వారు చదువుకోవడానికి ఏదో ఒక చోటు సరిపోతుందిలే అని అనుకోవద్దని అంటున్నారు నిపుణులు. ఏ మాత్రం అవకాశం ఉన్నా.. వారు చదువుకోవడానికి ప్రత్యేకంగా ఓ గదిని కేటాయించడం మంచిదని సూచిస్తున్నారు. అదే సమయంలో.. వారు చదువుకొనే స్థలం వంటగది, బాత్‌రూమ్, బెడ్ రూమ్‌లకు దూరంగా ఉండేట్టు చూసుకోవాలని చెబుతున్నారు.
పిల్లలు చదువుకోవడానికి ఎటువంటి సౌకర్యాలను ఏర్పాటుచేయాలి?
- పిల్లలు చదువుకునే గది గోడలు ఆకుపచ్చ, నీలం, పసుపు, తెలుపురంగుల్లో ఉంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. స్టడీ టేబుల్ దీర్ఘ చతురస్రాకారంలో సౌకర్యంగా ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు.
- ఈ రంగులు ఏకాగ్రతను పెంచుతాయని అంటున్నారు. దీంతో పిల్లలు చురుగ్గా ఉంటారు. ఎరుపు, నలుపు వంటి రంగులు పిల్లల జ్ఞాపకశక్తి, ఏకాగ్రతపై ప్రభావం చూపిస్తాయి.
- పిల్లల స్టడీరూమ్‌లో వాళ్లకు ఇష్టమైన రోల్‌మోడల్స్, మ్యాప్స్, గడియారం వంటివి పెడితే ఇవన్నీ వారికి కొంత జ్ఞానం, సమయపాలన, క్రమశిక్షణ అలవర్చుతాయి.
- పిల్లలు చదువుకునే స్టడీ రూమ్‌కు దగ్గరగా టీవీ, మ్యూజిక్ సిస్టమ్, అద్దాలు ఏర్పాటు చేయొద్దు. వీటి కారణంగా వారి దృష్టి పక్కకు మళ్లే ఛాన్స్ ఉంది.
- ఇంట్లో చిన్న కుండీలో మనీప్లాంట్ వంటి మొక్కల్ని పెంచితే.. పిల్లలు చదివే వాతావరణం ఆహ్లాదంగానూ, ఆరోగ్యవంతంగానూ ఉంటుంది.
- అలాగే వారు చదువుకునే గది మెట్ల పక్కన ఉండవద్దు. ఎందుకంటే ఇతరులు నడుస్తున్నప్పుడు వచ్చే శబ్దాలు.. పిల్లలను డిస్ట్రబ్ చేస్తాయి. చదువుపై మనసు పెట్టలేరు.
- పిల్లలు చదువుకునే స్టడీ రూమ్‌లోకి గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేటట్టు చూసుకోవాలి.
- సాధారణంగా పిల్లలు పరీక్షల సమయంలో భయపడుతూ నిద్రాహారాలు కూడా మర్చిపోతుంటారు. ఈ సమయంలో వాళ్లు ఆందోళనకు గురవుతుంటే మనం వారి మీద ఒత్తిడి పెంచకూడదు.
- మార్కులు ఎక్కువగా రావాలి.. ర్యాంకు రావాలి అని ఒత్తిడి చేస్తే.. దానివల్ల ప్రయోజనం ఉండకపోగా చదివిన విషయాలు కూడా మర్చిపోతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
- పరీక్షలు దగ్గర పడే కొద్దీ "చదవండి చదవండి" అని పదే పదే చెప్పొద్దు. ఇలా చేయడం వల్ల వారిపై ఒత్తిడి పెరుగుతుందే తప్ప, ఒరిగేదేమీ ఉండదు. దీనికి బదులుగా.. వాళ్లలో ఉన్న భయాన్ని పోగొట్టే ప్రయత్నం చేయాలి.
- మార్కుల విషయంలో అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇవ్వండి. ఆ తర్వాత.. ఎక్కడ లోపం జరుగుతోందో గుర్తించండి. వారితో మాట్లాడి సమస్యను తెలుసుకోండి. దాన్ని నివారించేందుకు పెద్దలుగా మీరేం చేయగలరో అది చేయండి. ఇలా చేస్తే.. తప్పకుండా పిల్లలు చక్కగా చదివే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు.
చేపలు వండినప్పుడు నీచు వాసన వస్తోందా ? అయితే ఈ టిప్స్ మీ కోసమే!
కండరాల నొప్పులు బాధిస్తున్నాయా? ఉల్లిపొట్టుతో చెక్ పెట్టండి!