పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిదని పెద్దలు చెబుతుంటారు. ఎన్నో రకాల అనారోగ్యాలను వీటితో తిప్పికొట్టొచ్చని అంటుంటారు. అయితే పండ్లను అలాగే తినడం మంచిదా లేదా జ్యూస్‌గా చేసుకుని తాగడం మంచిదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. ఈ నేపథ్యంలో పండ్లను జ్యూస్‌గా చేసి తాగడం వల్ల కలిగే లాభ నష్టాల గురించి ఓ సారి తెలుసుకుందాం. అలాగే సమ్మర్లో ఓ జ్యూస్ బెస్ట్.. ఓ జ్యూస్‌లో అధిక పోషకాలు ఉంటాయో ఓ సారి చూద్దాం.
ఆరోగ్యకరమైన జ్యూస్‌లలో అగ్రస్థానం దానిమ్మదే. చక్కెరతో పాటు యాంటి యాక్సిడెంట్లు ఇందులో పుష్కలంగా ఉంటాయి. అలాగే ద్రాక్ష జ్యూస్‌తోనూ చాలా లాభాలు ఉన్నాయి. ఇందులో విటమిన్ 'సి'తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే ద్రాక్ష జ్యూస్ శరీరంలోని మెటబాలిజాన్ని అభివృద్ధి చేస్తుంది. ఔషధ గుణాలు కూడా ద్రాక్ష జ్యూస్‌లో మెండుగా ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. 'శరీరంలో పేరుకుపోయే విష పదార్థాలు ద్రాక్ష జ్యూస్ తాగడం వల్ల బయటకు వస్తాయి. శరీర బరువును తగ్గించడంలోనూ ద్రాక్ష జ్యూస్ ఉపయోగపడుతుంది. ఉదయం అల్పాహారం తీసుకునే సమయంలో ద్రాక్ష జ్యూస్ తాగితే బరువు తగ్గవచ్చు.' అని న్యూటిషనిస్ట్ న్యూట్రిషనిస్ట్ శుభాంగి తమ్మళ్వార్ చెబుతున్నారు.
'రోజుకో నారింజ తినండి'
ద్రాక్ష జ్యూస్ తర్వాత శరీరానికి మంచి ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చేది నిమ్మ రసం. క్రమం తప్పకుండా రోజూ నిమ్మరసం తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది శరీరాన్ని ఉత్తేజం చేయడం సహా ఎనర్జీ లెవల్స్‌ను పెంచుతుంది. నారింజ పండు కూడా ఆరోగ్యానికి మంచిదే. ఇందులో విటమిన్- ఏ, బి స్వల్పంగా.. విటమిన్-సి ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజూ క్రమం తప్పకుండా రోజుకొక నారింజ తింటే శరీరానికి కావాల్సిన విటమిస్-సి లభిస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. విటమిన్-సి వల్ల రోగ నిరోధకశక్తి పెరుగుతుందని అంటున్నారు.
'టెట్రా ప్యాకెట్లలో జ్యూస్ తాగొద్దు'
'పిల్లలు, పెద్దలనే తేడాలేకుండా అందరూ జ్యూస్‌లు తాగేందుకు ఇష్టపడతారు. వేసవి వచ్చిందంటే చాలు పండ్ల రసాలు విరివిగా తాగుతారు. అయితే చాలా మంది టెట్రా ప్యాకెట్లలో ఉన్న జ్యూస్‌లు తీసుకుంటారు. కానీ వీటిల్లో మోతాదుకు మించి చక్కెర, ప్రిజర్వేటిస్ ఉంటాయి. కాబట్టి టెట్రా ప్యాకెట్లలో తాజా జ్యూస్ దొరికినా వాటికి దూరంగా ఉండాలి. ' అని ప్రముఖ న్యూట్రిషనిస్ట్ శుభాంగి తమ్మళ్వార్ చెబుతున్నారు.
'ఇంట్లోనే తయారు చేసుకోండి'
ప్యాకెట్లలో దొరికే జ్యూస్‌లు తీసుకోవడం కంటే ఇంట్లోనే తాజాగా పండ్ల రసాలు తయారు చేసుకుని తాగడం మంచిదని న్యూట్రిషనిస్ట్ శుభాంగి అన్నారు. ఇంట్లో చేసుకున్న జ్యూస్‌లు జల్లెడ పట్టకుండా తాగుతాం కాబట్టి అందులోని ఫైబర్, న్యూట్రియన్స్ అలాగే ఉంటాయని ఆమె చెబుతున్నారు. అదే బయటి జ్యూస్ పాయింట్లు, షాపులలో తాగే పండ్ల రసాల్లో అదనంగా ఐస్, చక్కెర, ప్రిజర్వేటివ్స్ కలుపుతారు కాబట్టి వాటిల్లోని పోషకాలు తగ్గిపోతాయని అంటున్నారు.
ఇంట్లోనే పండ్ల జ్యూస్‌లను తయారు చేసుకోవాలి. కూరగాయలతోనూ జ్యూస్ చేసుకోవచ్చు. ఏ జ్యూస్ చేసినా అందులో ఎక్కువ చక్కెర లేకుండా జాగ్రత్తపడాలి. చక్కెరలో ఉండే క్యాలరీల వల్ల బరువు పెరిగే ప్రమాదం ఉంది. ఇలాంటి జ్యూస్‌లు తాగడం వల్ల డయాబెటిక్ రోగులకూ ఇబ్బందే.
- శుభాంగి తమ్మళ్వార్, న్యూట్రిషనిస్ట్
వేసవిలో ఈ జ్యూస్‌లు బెస్ట్..
వేసవిలో ఎక్కువగా సిట్రస్ జాతికి చెందిన పండ్లతో చేసే జ్యూస్ తీసుకోవడం మంచిదని చెబుతున్నారు నిపుణలు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా వేసవిలో తొందరగా నీరసం వస్తుంది గనుక నిమ్మ, నారింజ వంటి పండ్లతో చేసే జ్యూస్‌లు మంచివని అంటున్నారు. 'ఎవరికైనా వడదెబ్బ తగిలినా, బాగా నీరసపడినా వెంటనే ఒక గ్లాసు నిమ్మరసంలో కాస్త ఉప్పు, చక్కెరను కలిపి తాగించాలి. ఉప్పు, చక్కెర శరీరంలో సోడియం, ఎలక్ట్రోలైట్‌ను సమతూకం చేసి శరీరాన్ని తిరిగి ఉత్తేజం చేస్తుంది' అని నిపుణులు చెబుతున్నారు.
'జ్యూస్ కంటే పండ్లు తినడం మేలు'
ఆరోగ్యం కోసమైతే పండ్లను జ్యూస్‌గా కంటే నేరుగా తినడమే మేలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలా తీసుకోవడం వల్ల పండ్లలో ఉన్న పోషకాలు, పీచు పదార్థం శరీరానికి నేరుగా లభిస్తాయని చెబుతున్నారు. పండ్లను మోతాదుకు మించి తిన్నా ఫర్వాలేదు గానీ.. జ్యూస్‌ను మాత్రం తగిన మోతాదులో తీసుకోమని సూచిస్తున్నారు.