Best Exercises For Diabetic Patients : ప్రపంచంలో ఎక్కువ మంది బాధపడుతున్న ఆరోగ్య సమస్య డయాబెటిస్. షుగర్ అని పిలిచే డయాబెటిస్‌కు ప్రధాన కారణం శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగిపోవడం. సరైన శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఆధునిక జీవిన విధానానికి అలవాటు పడి ఎక్కువ మంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. ఓ అంచనా ప్రకారం ప్రపంచంలో 422 మిలియన్ల జనాభా డయాబెటిస్తో బాధపడుతున్నారు. షుగర్ కారణంగా ఏటా 1.5 మిలియన్ల మంది మరణిస్తున్నారు.
జీవనశైలి, చెడు అలవాట్లు, ఒత్తిడి, నిద్రలేమి, శారీరక శ్రమలేకపోవడం వల్ల డయాబెటిస్ పెరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఒక్కసారి డయాబెటిస్ బారిన పడితే దానిని కంట్రోల్లో ఉంచుకోవడం తప్ప పూర్తిగా నయం కాదు. షుగర్ పేషెంట్స్ రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్లో లేకపోతే కిడ్నీ, గుండె, ఊపిరితిత్తులు, కంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. డయాబెటిక్స్ చేసే చిన్నపొరపాట్లు ప్రాణాంతకంగా మారుతున్నాయి. మందులు వాడుతున్నా సరే వ్యాయామం చేకపోతే షుగర్‌ను నియంత్రణలో ఉంచలేమంటున్నారు నిపుణులు.
అందువల్ల డయాబెటిస్ రోగులు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని డాక్టర్లు సూచిస్తున్నారు. షుగర్ బాధితులు కొన్ని వ్యాయామాలతో వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. వారానికి కనీసం 150 నిమిషాలు తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. అంటే రోజుకు కనీసం 21 నిమిషాలకు తగ్గకుండా వ్యాయామం చేస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
స్విమ్మింగ్
ఈత శరీరానికి ఉత్తమమైన వ్యాయామం. ఇది మిమ్మల్ని ఫిట్‌గా మారుస్తుంది. అంతేకాదు మధుమేహాన్ని నియంత్రించడంలో కూడా చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. ఓ అధ్యయనం ప్రకారం టైప్ 1, టైప్ 2 డయాబెటిస్లను అదుపు చేయడంలో స్విమ్మింగ్ ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. స్విమ్మింగ్ రక్త ప్రసరణను వేగవంతం చేసి కొలెస్ట్రాల్ మొత్తాన్ని తగ్గిస్తుంది. బరువు, రక్తంలో చక్కెర స్థాయిల్లో ఎలాంటి హెచ్చుతగ్గులు అనేవి ఉండవు.
సైక్లింగ్
సైక్లింగ్ అనేది ఒక రకమైన ఏరోబిక్స్ వ్యాయామం లాంటిది. ఇది గ్లూకోజ్ స్థాయిని కంట్రోల్లో ఉంచుతుంది. అలాగే అధిక బరువు, రక్తపోటును కూడా నియంత్రిస్తుంది. 40 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారు, డయాబెటిస్ రోగులు సైక్లింగ్ చేస్తే ఆరోగ్యానికి మంచిది. సైక్లింగ్ అనేది తేలికపాటి ఎక్సర్సైజ్గా చెబుతుంటారు ఆరోగ్య నిపుణులు.
వాకింగ్
ప్రతి ఒక్కరూ చేయాల్సిన వ్యాయామం వాకింగ్. ముఖ్యంగా 'డయాబెటిస్ రోగులు రోజుకు కనీసం 20 నిమిషాలు అయినా నడవాలి. వీలైతే ప్రతిరోజు 20 నుంచి 40 నిమిషాలు వాకింగ్ చేయడం వల్ల డయాబెటిస్ను అదుపు చెయొచ్చు. రోజువారి నడక చాలా మేలు చేస్తుంది. మధుమేహం సమస్య నుంచి ఉపశమనం పొందడంలో నడక ముఖ్యపాత్ర పోషిస్తుంది. డయాబెటిస్ బాధితులకు వాకింగ్ దివ్య ఔషధం లాంటిది' అని వైద్యులు సూచిస్తున్నారు.
వాకింగ్ అనేది చక్కెర స్థాయులను అదుపు చేస్తుందని, డయాబెటిస్ రోగులకు ఉపయోగకరంగా ఉంటుందని ఎన్నో అధ్యయనాల్లో తేలింది. అంతేకాకుండా మన రోజు వారి కార్యక్రమాల్లో భాగంగా చాలా మంది మెట్లు ఎక్కడానికి ఇష్టపడరు. బిజీ లైఫ్‌లో పెద్ద భవనాల్లో ఒక ఫ్లోర్ నుంచి ఇంకో ఫ్లోర్‌కు వెళ్లేందుకు లిఫ్ట్‌ను ఉపయోగిస్తుంటారు. దీనివల్ల శారీరక శ్రమ తగ్గుతుంది. ఆరోగ్యంగా ఉండేందుకు మెట్లు ఎక్కడం చాలా మంచిది.
యోగా
డయాబెటిస్ అదుపు చేయడంలో యోగా ఉత్తమమైన సాధనం. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో యోగా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి ఎముకలను బలపరుస్తుంది. ఓ అధ్యయనం ప్రకారం ప్రతి రోజూ అరగంట పాటు యోగా చేయడం చేస్తే డయాబెటిస్ సమస్య చాలావరకు తగ్గుతుంది.
అధ్యయనం ఏం చెబుతోందంటే?
హార్వర్ట్ నిపుణుల సలహా ప్రకారం, ఆహారం తీసుకున్న గంట నుంచి మూడు గంటల తర్వాత వ్యాయామం చేయాలి. మీరు ఇన్సులిన్ ఉపయోగిస్తే వ్యాయామం చేసే ముందుస్థాయి 100 ఎంజీ కంటే తక్కువ ఉంటే ఒక పండు తినడం లేదా అల్పహారం తీసుకోవడం వల్ల అది పెరుగుతుంది. మీకు హైపోగ్లైసీమియాను నివారించడంలో సహాయపడుతుంది. మళ్లీ పరీక్షించడం ద్వారా మీ బ్లడ్ షుగర్ స్థాయి స్థిరంగా ఉందో లేదో చూపిస్తుంది. ప్రత్యేకంగా ఏదైనా కఠినమైన వ్యాయామం చేస్తే మీ బ్లడ్ షుగర్‌ను చెక్ చేసుకోవడం మంచిది.
మీరు ఫైబర్ మంచిదని తినేస్తున్నారా? - ఈ సమస్యలు గ్యారెంటీ!
హెపటైటిస్ ప్రమాదం - క్యాన్సర్‌గా మారే వరకు లక్షణాలు కనిపించవు - ఇలా అడ్డుకోవాల్సిందే!