Adequate Sleep: మనకు ఎన్ని గంటల నిద్ర అవసరమనేది కచ్చితంగా తెలియదు. ఆయా వ్యక్తుల అవసరాన్ని బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. సాధారణంగా పెద్దవారికి రాత్రిపూట 7-9 గంటల నిద్ర అవసరమని నిపుణులు చెబుతుంటారు. మరి మనకు నిద్ర సరిపోతోందా, లేదా అనేది తెలుసుకోవటమెలా? దీన్ని కొన్ని విషయాల ద్వారా గుర్తించే అవకాశముంది.
- టీవీ చూస్తున్నప్పుడు కునికి పాట్లు పడుతున్నారా? కారు నడుపుతున్నప్పుడు నిద్ర వస్తున్నట్టు అనిపిస్తోందా? అయితే నిద్ర సరిపోనట్టే. మెలకువగా, చురుకుగా ఉండాల్సిన సమయంలో నిద్ర వస్తోందంటే ఏదో తేడా ఉందనే అర్థం.
- రోజూ ఉదయం అలారం మోగితే గానీ మెలకువ రాకపోవటమూ నిద్ర సరిపోటం లేదనటానికి సూచికే. మన నిద్ర, మెలకువలను జీవ గడియారం నియంత్రిస్తుంటుంది. నిద్ర సరిపోయినట్టయితే సమయానికి దానంతటదే మెలకువ వచ్చేస్తుంది. కాబట్టి లేవాల్సిన వేళకు మెలకువ రాలేదంటే రాత్రిపూట సరిగా నిద్రపోనట్టే.
- సెలవు దినాల్లో పగటిపూట గంటల కొద్దీ నిద్రపోతున్నారా? అయితే మిగతా రోజుల్లో సరిగా నిద్రపోవటం లేదనే అనుకోవచ్చు. కోల్పోయిన నిద్రను భర్తీ చేసుకునే ప్రయత్నంలో శరీరం ఇలా వెసులుబాటు ఉన్నప్పుడు పగటిపూట ఎక్కువసేపు విశ్రాంతిని కోరుకుంటుంది మరి.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి: నీళ్లు తాగితే.. ఈ సమస్యలుండవట!