Belly Fat Burning Floor Exercises : ఆధునిక జీవనశైలి, నిద్రలేమి, మారిన ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి.. ఇలా కారణమేదైనా కానీ, వయస్సుతో సంబంధం లేకుండా వేధిస్తున్న సమస్యగా అధిక బరువును చెప్పుకోవచ్చు. వాస్తవానికి పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజుల్లో ముఖ్యంగా యువత దీని బారిన అధికంగా పడుతున్నారు. అయితే ఈ కొవ్వు సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలి. బెల్లీ ఫ్యాట్‌ను త్వరగా వదిలించుకోకపోతే దీని ద్వారా అనేక అనారోగ్యాలు, వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును తగ్గించడానికి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచిస్తున్నారు. అలాగే పలు రకాల వ్యాయామాలు చేయడం వల్ల దీని నుంచి త్వరగా బయటపడవచ్చని చెబుతున్నారు. ఆ ఎక్సర్సైజులు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
క్రంచెస్
Crunches Exercises : సిక్స్ ప్యాక్ కోసం చేసే వ్యాయామాల్లో ఒకటి క్రంచెస్. ఇది బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించేందుకు చాలా ఉపయోగపడుతుంది. ఈ ఎక్సర్సైజ్లో భాగంగా ముందు నేలపై పడుకోవాలి. మోకాళ్లను లేపి 90 డిగ్రీల కోణంలో ఉంచాలి. రెండు చేతులను తల వెనుక భాగంలో పెట్టాలి. ఆ తర్వాత శరీర పైభాగాన్ని మెళ్లగా లేపాలి. ఇలా చేసే సమయంలో మోకాళ్లు వంగకుండా చూసుకోవాలి. అలాగే చేతులు తల భాగం నుంచి జారకుండా చూసుకోవాలి.. లేకపోతే మెడ భాగంపై ఒత్తిడి పడుతుంది. క్రంచ్ చేసే సమయంలో ఊపిరి వదలాలి. వెన్ను భాగాన్ని కిందకు తీసుకెళ్లేటప్పుడు ఊపిరి తీసుకోవాలి.
బైస్కిల్ క్రంచెస్
Bicycle Crunches Benefits : ఈ వ్యాయామం చేసే ముందు నేలపై పడుకోవాలి. ఆ తర్వాత శరీర పైభాగాన్ని, మోకాళ్లను కాస్త పైకి లేపి 90 డిగ్రీల కోణంలో ఉంచాలి. అలాగే రెండు చేతులను తల వెనుక భాగంలో పెట్టాలి. ఆ తర్వాత ఎడమ మోచేతి భాగంతో కుడి మోకాలిని అందుకోవాలి. వెంటనే యథాస్థానానికి వచ్చి.. కుడి మోచేతితో ఎడమ మోకాలిని అందుకోవాలి. ఇలా రోజుకు 3 సెట్లు సాధన చేయాలి. ప్రతి సెట్లో కనీసం 20 నుంచి 25 సార్లు మోచేతులతో మోకాళ్లను అందుకోవడానికి ప్రయత్నించాలి.
రష్యన్ ట్విస్ట్స్
Russian Twist Exercise Benefits : పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును తగ్గించడంలో ఈ వ్యాయామం చాలా ఉపయోగపడుతుంది. ఇందులో భాగంగా ముందుగా నేల మీద కూర్చోవాలి. ఆ తర్వాత కాస్త వెనక్కి వాలాలి. మోకాళ్లను 45 డిగ్రీల కోణంలో ఉండేలా చూసుకోవాలి. అనంతరం చేతుల్లో ఏదైనా బంతి లాంటి వస్తువును పట్టుకోవాలి. తర్వాత కుడి వైపునకు తిరగాలి. మళ్లీ యథాస్థితికి వచ్చి ఎడమ వైపునకు తిరగాలి. ఇలా రోజుకు 3 సెట్లు సాధన చేయాలి. సెట్లో కుడి వైపునకు 10 సార్లు, ఎడమ వైపునకు 10 సార్లు తిరగాలి.
ప్లాంక్
Plank Exercise Benefits : బరువు తగ్గించాలనుకునే వారికి, ఫిట్నెస్ను పెంచుకోవాలనే వారికి ప్లాంక్ బాగా ఉపయోగపడుతుంది. ఇది పుషప్ లాంటిదే. ఇందులో భాగంగా ముందు వెల్లకిలా పడుకోవాలి. ఆ తర్వాత రెండు కాళ్ల పాదాలు, మోచేతులను సమాంతరంగా ఉంచి కాస్త పైకి లేవాలి. ఈ పొజిషన్లో సాధ్యమైనంత ఎక్కువ సేపు ఉండేందుకు ప్రయత్నించాలి. క్రమంగా ప్లాంక్ చేసే సమయాన్ని పెంచుకుంటూ పోవాలి.
లెగ్ రైజెస్
Leg Raises Exercise Benefits : ఈ వ్యాయామంలో భాగంగా ముందుగా నేలపై పడుకోవాలి. కాళ్లు, చేతులను సమాంతరంగా ఉంచుకోవాలి. ఆ తర్వాత రెండు కాళ్లను సమాంతరంగా పైకి లేపాలి. అనంతరం మెల్లగా యథాస్థానంలోకి వాటిని తీసుకెళ్లాలి.
డెడ్ బగ్
Dead Bug Exercise Benefits : కండరాలను ఉత్తేజితం చేయడంలో ఈ వ్యాయామం ఎంతగానో దోహదపడుతుంది. డెడ్ బగ్‌లో భాగంగా ముందుగా నేలపై పడుకోవాలి. ఆ తర్వాత మోకాళ్లను కాస్త పైకి లేపాలి. రెండు చేతులను మోకాళ్లకు సమాంతరంగా పైకి లేపాలి. ఆ తర్వాత కుడి చేతిని, ఎడమ మోకాలును ఒకేసారి నేలకు ఆన్చాలి. అనంతరం యథాస్థానికి వచ్చి ఎడమ చేతిని, కుడి మెకాలును ఒకేసారి కిందకు తీసుకెళ్లాలి. మళ్లీ పూర్వస్థితికి రావాలి.
క్రాబ్ వాక్
Crab Walk Exercise Benefits : ఈ ఎక్సర్సూజ్లో భాగంగా ముందుగా మోకాళ్లపై కూర్చోవాలి. రెండు కాళ్లను నేలపై ఉంచాలి. చేతులను వెనక వైపు ఉంచాలి. ఈ సమయంలో అరచేతిని కూడా వెనుక వైపు చూస్తూ ఉండేలా చూసుకోవాలి. ఆ తర్వాత నడుమును పైకి ఎత్తి.. చేతులు, కాళ్ల సాయంతో వెనుక వైపు నడవాలి. ఆ తర్వాత ముందు వైపు నడుచుకుంటూ రావాలి. దీన్ని కొన్ని సెట్ల పాటు రిపీట్ చేయాలి.
కోబ్రా పోజ్
Cobra Pose Exercise Benefits : ఈ భంగిమలో భాగంగా ముందుగా నేల మీద వెల్లకిలా పడుకోవాలి. ఆ తర్వాత శరీర ముందు భాగాన్ని చేతుల సాయంతో పైకి లేపాలి. ఈ సమయంలో చేతులను భుజానికి దూరంగా ఉంచకూడదు. ఈ పోజ్‌లో 15 నుంచి 30 సెకన్ల పాటు అలాగే ఉండాలి. ఊపిరి బాగా తీసుకొని, ఆ తర్వాత నడుము భాగాన్ని నేలకు ఆన్చాలి. దీన్ని మూడు నుంచి నాలుగు సార్లు రిపీట్ చేయాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ వ్యాయామాలు చేయడమే కాకుండా మంచి డైట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది.