శరీరానికి శక్తినిచ్చే దుంపజాతి ఆహార పదార్థాల్లో బీట్‌రూట్‌ది ప్రత్యేక స్థానం. కంటికి ఇంపుగా కనిపించడమే కాదు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందీ బీట్రూట్. క్యారెట్, బీట్రూట్ లాంటివి ఆరోగ్యానికి చక్కని ఔషధంగా పనిచేస్తాయి. ఈ రెండూ శరీరంలో రక్తశాతాన్ని పెంచుతాయని మనకు తెలిసిందే. కానీ కొందరు బీట్రూట్ను వెలివేస్తుంటారు. బీట్రూట్ను తినొచ్చు, జ్యూస్ చేసుకుని తాగొచ్చు, కూరగానూ వండుకోవచ్చు. అయితే ఎక్కువమంది జబ్బు చేసినప్పుడు పెట్టే వంటకంగానే దీన్ని వాడుతున్నారు. మధుమేహంతో ఇబ్బందిపడే వారు బీట్రూట్ను తీసుకుంటే కాలేయ సంబంధింత సమస్యలు తలెత్తవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బీట్రూట్ వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుంటే దీన్ని తినలేకపోయినా.. కనీసం జ్యూస్‌లా చేసుకుని అయినా తాగుతారని అంటున్నారు.
ప్రస్తుత ఉరుకుల పరుకుల జీవితంలో అనేక కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయం తదితర వ్యాధులన్నీ జీవనశైలి మార్పుల వల్లే తలెత్తుతున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి వ్యాధులను నిరోధించాలంటే మంచి ఆహారాన్ని తీసుకోవడం అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. భుజించే ఆహారంలో బీట్రూట్ లాంటి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను భాగం చేసుకోవాలని ప్రముఖ న్యూట్రిషనిస్ట్ లహరి సూరపనేని అన్నారు. బీట్రూట్ను పచ్చిగా తినడం లేదా ఉడికించి తినడం లేదా జ్యూస్ చేసుకుని తాగుతూ ఉండాలని ఆమె సూచించారు.
"బీట్రూట్ క్రమం తప్పకుండా భోజనంలో తీసుకుంటూ ఉండాలి. పచ్చిగా తీసుకున్నా, ఉడికించి లేదా జ్యూస్‌గా చేసుకుని తీసుకున్నా దీంట్లో ఉన్న పోషకాలు తగ్గవు. ఇందులో ఉండే నైట్రేట్లు, నైట్రిక్ ఆక్సైడ్.. అధిక రక్తపోటును తగ్గించడంలో ఉపయోగపడతాయి. ఇవి రక్త సరఫరాలో ఉండే అడ్డంకులను తొలగిస్తాయి. అవయవాలన్నింటికీ ఆక్సిజన్ సరిగ్గా అందించడంలో తోడ్పడతాయి. రోజూ ఒక గ్లాస్ బీట్రూట్ జ్యూస్ తాగుతూ ఉండాలి. జ్యూస్ తాగలేని వారు ఒక బీట్రూట్ ముక్కను రోజూ తింటూ ఉండాలి."
- ప్రముఖ న్యూట్రిషనిస్ట్ లహరి సూరపనేని
కంటికి ఎంతో మేలు:
బీట్రూట్లో నైట్రేట్‌తో పాటు విటమిన్లు, ఖనిజాలు, అమైనో ఆమ్లాలు దండిగా ఉంటాయి. శరీరం కాల్షియంను ఉపయోగించుకోవడంలో ఇది ఎంతగానో తోడ్పడుతుంది. వీటిని తినడం వల్ల శరీరానికి కావాల్సిన ఐరన్ సమకూరి రక్తహీనత లేకుండా చేస్తుంది. బాడీలో హిమోగ్లోబిన్, రక్తం పెరుగుతాయి. అలాగే దేహానికి కావాల్సిన ఆక్సిజన్ కూడా లభిస్తుంది.
బీట్రూట్లో ఉండే నైట్రేట్ నిల్వలు నైట్రేట్ ఆక్సైడ్‌గా మారి రక్త ప్రసరణ వేగాన్ని పెంచుతాయి. ఫలితంగా రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తాయి. వీటిలోని నైట్రేట్ మెదడు పనితీరును మెరుగుపరిచి శక్తిమంతంగా మార్చగలదు. బీట్రూట్లో ఉండే శక్తిమంతమైన లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా కాపాడుతుంది. బీట్రూట్లో విరివిగా లభించే కెరోటినైట్స్ కళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో తోడ్పడతాయి. బీట్రూట్కు ఎరుపు రంగును కలిగించే బీటా సయానిన్కు పెద్దపేగుల్లో క్యాన్సర్‌తో పోరాడే లక్షణం ఉంది.
చురుగ్గా, బలంగా ఉండాలంటే బీట్రూట్ తినాల్సిందే:
బీట్రూట్లో నైట్రిక్ ఆక్సైడ్, నైట్రేట్స్‌తో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. దీని వల్ల మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. దీంతో శరీరం ఎప్పుడూ చాలా ఆరోగ్యంగా, బలంగా ఉంటుంది. సీజనల్ వ్యాధులు, చర్మ సంబంధిత రోగాలను తట్టుకుంటుంది. బీట్రూట్లో ఉండే ఫైబర్ మన జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేసేందుకు దోహదపడుతుంది. పెద్దపేగులో ఉండే బ్లాకేజీలను తొలగించడానికి బీట్రూట్లో ఉండే ఫైబర్ తోడ్పడుతుంది. ఇందులో బి విటమిన్స్ శరీరాన్ని మరింత చురుగ్గా ఉంచుతాయి. బీట్రూట్లో మరో ప్రయోజనం కూడా ఉంది. వంద గ్రాముల బీట్రూట్ తిన్నా శరీరంలో చాలా తక్కువ కేలరీలు వస్తాయని న్యూట్రిషనిస్ట్ లహరి సూరపనేని వివరించారు.