Back Pain Reasons And Remedies : వెన్ను నొప్పితో బాధపడేవారి సంఖ్య ఈ రోజుల్లో ఎక్కువైపోయింది. ఈ నొప్పికి డెస్క్ జాబ్స్ ఒక కారణంగా చెప్పొచ్చు. అదే సమయంలో వ్యాయామం చేయకపోవడం కూడా ప్రధాన కారణమని చెప్పాలి. నడుము నొప్పి సమస్యను తరిమికొట్టడానికి వైద్యులు పలు సూచనలు చెబుతున్నారు. జీవన శైలిని మార్చుకోవడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చని అంటున్నారు. అలాగే వాళ్లు మరిన్ని సూచనలు కూడా చేస్తున్నారు. వెన్ను నొప్పిని తగ్గించేందుకు డాక్టర్లు చెబుతున్న సలహాలు, సూచనలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ రోజుల్లో శారీరక శ్రమ చేయడం చాలా వరకు తగ్గిపోయింది. ఒకప్పుడు అంటే జనాభాలో ఎక్కువ మటుకు వ్యవసాయం చేసేవారు. అలాగే వ్యవసాయ సంబంధిత కూలీ పనులకు వెళ్లేవారు. వివిధ వర్గాలకు చెందిన ప్రజలు తమ కుల వృత్తుల్లో బిజీగా ఉండేవారు. ఈ పనులన్నీ శారీరక శ్రమతో కూడుకున్నవే. రోజువారీ పనులతో పాటు ఇంటి పనుల్లోనూ చెమటోడ్చేవారు. దీని వల్ల వారు చాలా ఫిట్‌గా ఉండేవారు. ఎలాంటి రోగాలూ వారి దరిచేరేవి కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఈ రోజుల్లో వ్యవసాయ సంబంధిత పనులు చేసేవారు తక్కువైపోయారు. యువత ఎక్కువగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలపై ఆసక్తి చూపిస్తున్నారు.
Tips For Back Pain Relief At Home : ఐటీ జాబ్స్‌తో పాటు చాలా రకాల ఉద్యోగాల్లో కంప్యూటర్ల వాడకం బాగా పెరిగింది. కూర్చొని చేసే ఈ డెస్క్ జాబ్స్ వల్ల నడుము, వెన్ను నొప్పి లాంటి సమస్యలు త్వరగా వచ్చేస్తున్నాయి. వీటితో బాధపడేవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గంటల తరబడి ఒకేచోట కూర్చొని పనిచేయడం, కూర్చునే తీరు సరిగా లేకపోవడం, వ్యాయామం చేయకపోవడం, పని ఒత్తిడి లాంటి వాటి వల్ల వెన్ను నొప్పి బాధితులు ఎక్కువైపోతున్నారు.
కూర్చునే భంగిమా ముఖ్యమే!
Back Pain Treatment : వెన్ను నొప్పితో బాధపడేవారు సరిగ్గా కూర్చోలేరు. ఎక్కువసేపు నిల్చోలేరు. కూర్చున్నా, నిల్చున్నా.. ఆఖరికి పడుకున్నా ఈ సమస్య వేధిస్తుంది. అయితే కొన్ని రోజువారీ పనులతో నడుము నొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చు. ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే తరచూ వ్యాయామం చేయడం తప్పనిసరి. కొన్ని ప్రత్యేక ఆసనాలతో దీని నుంచి బయటపడొచ్చని నిపుణులు అంటున్నారు. కంప్యూటర్లు లేదా ల్యాప్ టాప్స్ ఎక్కువగా వాడేవాళ్లు సరైన భంగిమలో కూర్చోవడం ద్వారా నడుము నొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చని ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కే సాకేత్ తెలిపారు.
'కంప్యూటర్లు వాడే సమయంలో సరైన భంగిమలో కూర్చోకపోతే వెన్ను నొప్పి బారిన పడే ఛాన్స్ ఉంది. బరువులు ఎత్తే టైమ్‌లో నేరుగా వంగి వెన్నుపూసపై ఒత్తిడి వచ్చేలా చేసినా ఈ సమస్య తప్పదు. వెన్నుపూసలో కాకుండా చుట్టూ ఉండే కండరాల్లో ఏమైనా సమస్యలు ఉన్నా నడుము నొప్పి వేధిస్తుంది. శారీరక, మానసిక ఒత్తిళ్ల వల్ల కూడా వెన్ను నొప్పి బాధిస్తుంది. విటమిన్-డీ, కాల్షియం లోపం కారణంగా కూడా నడుము నొప్పి వస్తుంది. కంప్యూటర్లు వాడేవారు వాటిని కుర్చీ ఎత్తుకు సరిపోయేలా అడ్జస్ట్ చేసుకుంటే వెన్ను నొప్పి తగ్గుతుంది' అని డాక్టర్ సాకేత్ చెప్పుకొచ్చారు.
'వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్లు నేల మీద లేదా పరుపుపై కూర్చొని పనిచేస్తున్నారు. ఇలాంటి వాళ్లు ల్యాప్ టాప్ స్టాండ్స్ లాంటివి వాడాలి. డెస్క్ జాబ్స్ చేసేవాళ్లు గంటకు ఒకసారి 5 నుంచి 10 నిమిషాల పాటు బ్రేక్ తీసుకోవాలి. అలాగే నడుము నొప్పిని తగ్గించే స్ట్రెచింగ్ ఎక్సర్ సైజులు చేయాలి. ప్రతిరోజూ సూర్య నమస్కారాలు చేయడం అలవాటు చేసుకోవాలి. విటమిన్-డీ లోపం ఉన్నవారు దాన్ని సరిచేసుకోవాలి. దూర ప్రయాణాలు చేసేవారు గతుకుల రోడ్లలో బైకులపై జర్నీ చేయకపోవడం మంచిది. వంగి చేసేపనులు, మెట్లు ఎక్కడం, దూర ప్రయాణాలను తగ్గించుకుంటే వెన్ను నొప్పి సమస్య తగ్గుతుంది. బరువులు లేపాల్సి వచ్చినప్పుడు శరీరానికి దగ్గరగా ఉండేలా చూసుకొని చేయాలి. స్విమ్మింగ్, సైక్లింగ్, యోగా లాంటివి చేయడం వల్ల కూడా నడుము నొప్పి సమస్య నుంచి బయటపడొచ్చు' అని డాక్టర్ సాకేత్ పేర్కొన్నారు.
ఇవీ చదవండి : Liver Healthy Food : లివర్ ఆరోగ్యంగా ఉండాలా?.. ఇవి తినేయండి!
ఇదొక సూపర్ జాబ్.. రోజుకు 10వేల స్టెప్స్ వేయడమే పని.. జీతం రూ.8.2లక్షలు!