పిల్లల పెరుగుదలలో కలిగే లోపాలను ముందే గుర్తించి సరైన చికిత్స అందించటంపైనే వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. చాలా సందర్భాల్లో అంతగా ప్రస్ఫుటం కాని లక్షణాలు.. పూర్తిస్థాయి వ్యాధి లక్షణాలుగా మారేంతవరకు గుర్తు పట్టేవిగా ఉండవు. అయితే ఆటిజం లక్షణాలను సకాలంలో గుర్తిస్తే.. మొరుగైన చికిత్స అందించి వ్యాధిని కొంతైనా నయం చేయవచ్చు.
సాధారణంగా మందబుద్ధితో కూడిన స్వపరాయణత్వం పిల్లల్లో సామాజిక ప్రవర్తనను, భావప్రకటనను ప్రభావితం చేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఆటిజం లక్షణాలను గుర్తించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. భారత్ లోనే 20 లక్షల మంది పిల్లలు ఆటిజంతో బాధ పడుతున్నారు.
పిల్లల్లో భావ ప్రకటన:
పదాలు నేర్వక ముందే భావవ్యక్తీకరణ ప్రారంభమవుతుంది. నెలల వయసులో ఉండగానే చిరునవ్వులు చిందించటం మనిషి సామాజిక వ్యక్తి అని చెప్పటానికి ఉదాహరణ. హావభావాలు, చేతులు, వేళ్లు ఉపయోగించి ఇతరులతో సంభాషించటం పిల్లల ఎదుగుదలలో మైలురాళ్లు.
ఆటిజం ప్రారంభ లక్షణాలు:
ఉపాధ్యాయులు, వైద్యులు, కుటుంబ సభ్యులు కింద సూచించిన లక్షణాలను ముందే అవగతం చేసుకుని ఉండాలి.
- 6 నెలల వయసులో: చిరునవ్వులు, నవ్వులు, మొహంలో సంతోషం కనిపించకపోవటం
- 9 నెలల వయసులో: ఎదుటి వారి హావభావాలకు, చిరునవ్వులకు, చిన్న చిన్న మాటలకు, శబ్దాలకు ప్రతిస్పందించకపోవటం.
- 12 నెలల వయసులో: పేరుతో పిలిచినా జవాబివ్వకపోవటం; పిల్లల భాష మాట్లాడలేకపోవటం; చేతి సంజ్ఙలకు బదులివ్వకపోవటం
- 16 నెలల వయసులో: పదాలను పలకలేకపోవటం
- 24 నెలల వయసులో: అనుసరణ, అనుకరణ లేని రెండు పదాలు కల వాక్యాలను కూడా చెప్పలేకపోవటం.
పిల్లల భాషాభివృద్ధిని ఎలా కొలవవచ్చు?:
తల్లిదండ్రులు పిల్లల మాటలను గమనిస్తూ.. మార్పులను పిల్లల వైద్యలకు తెలియజేస్తుండాలి. 18 నుంచి 24 నెలల మధ్య ఆటిజం లక్షణాలున్నాయేమోనని గమనించాలి. “మాడిఫైడ్ చెక్ లిస్ట్ ఫర్ ఆటిజం ఇన్ టాడ్లర్స్ – రివైజ్డ్” అనే ఈ చిరు పుస్తకం ఇతరుల సహాయం లేకుండానే ఆటిజంను ముందే పసిగట్టడానికి సహాయం చేస్తుంది. ఆటిజం వచ్చే అవకాశం ఎక్కువున్న పిల్లలను వైద్యుల చెంతకు తీసుకువెళ్లవచ్చు. దీని ద్వారా 4 సం.ల వయసులో ఆటిజంను గుర్తించగలిగే స్థితి నుంచి 2 సం.ల వయసుకే గుర్తించవచ్చు.
బిడ్డకు ఆటిజం ప్రమాదం ఉంటే ఏం చేయాలి?:
ఆటిజం ఉన్నట్టు అనుమానం కలిగితే “కొంత కాలం ఆగి చూద్దాం” అనే సూత్రం పనికిరాదు. వ్యాధి లక్షణాలు మెదడులో నాడీ కణాల ఎదుగుదల లేమిని సూచిస్తాయి. అందువల్ల చికిత్స వెంటనే అందించాలి. ఫలితంగా నాడీ కణాలు ఆరోగ్యవంతంగా పెరుగుతాయి. పిల్లల ముఖ కవళికలు, కంటిచూపు, చేష్టలు, అనుకరణ, ఆటలు మొదలైన వాటిలో ఆటిజం లక్షణాలు కనిపిస్తాయి. అందరితో కలివిడిగా ఉండేట్టుగా పిల్లలకు కుటుంబ సభ్యులు శిక్షణనిస్తూ ఉండాలి.
“సెన్సరీ ఇంటిగ్రేషన్ థెరపీ” ద్వారా వారిలో భావ ప్రకటనను మెరుగుపరచి వారి ప్రవర్తనలో మార్పులు తేవచ్చు. ఆటిజం ఉన్న పిల్లలు చక్కటి వాతావరణంలో, కంటికిష్టమైన దృశ్యాల మధ్య చక్కగా ప్రవర్తిస్తారు. ఆటిజం ఇప్పటికీ ఒక పజిల్ లా ఉన్నా.. ఇందులో జరుగుతున్న పరిశోధనలు, పెరిగిన జాగృతి, సకాలంలో వ్యాధి నిర్ధరణ, వారికి కలుగజేసే సౌకర్యాలు అన్ని సమకూరితే ప్రహిళికలోని విడిపోయిన ముక్కలన్నీ సరిగా కలిసి అందమైన చిత్రం ఏర్పడుతుంది.