మనం దేశంలో.. అందులోనూ తెలుగు రాష్ట్రాల్లో మిర్చీ ఘాటెక్కువ! మన వంటకాల్లో కారం జోడిస్తేనే తృప్తి మనకు. మరి ఇంతలా మిర్చీ తింటున్నాం కదా కారంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటి.. అనారోగ్యానికి దారితీసే కారకాలేమైనా ఉన్నాయా.. అనే సంగతి క్షుణ్నంగా వివరించారు మన ఆయుర్వేద నిపుణులు డాక్టర్ రంగనాయకులు.. అవేంటో మీరూ చూసేయండి.
మంట ఎందుకు..?
తెలిసో తెలియకో పచ్చిమిర్చి కొరికినప్పుడు.. నాలుక మండిపోతుంది. కొందరికి ముక్కు కారుతుంది. కారం తట్టుకోలేక పరుగులు తీస్తుంటారు మరికొందరు. ఇంతకీ అలా ఎందుకు జరుగుతుందో తెలుసా..?
మన శరీరంలోకి ఏ పదార్థం ప్రవేశించినా జీర్ణాశయంలో స్రావాలు పెరుగుతాయి. కానీ, కారం, మసాలాలు తిన్నప్పుడు ఆ ప్రక్రియ వేగవంతమవుతుంది. మిర్చీలో క్యాప్సికిన్ అనే పదార్థం ఉంటుంది. అది నాలుక, నరాల చివర్లకు అతుక్కుపోయి నొప్పి మంట కలిగిస్తుంది. దీంతో శరీరం ఆ బాధను తప్పించుకోవాలని ప్రయత్నిస్తుంది. వెంటనే శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. జీర్ణాశయంలో ఆమ్లాలు విడుదలవుతాయి. రక్త నాళాల వేగం పెరుగుతుంది. దీంతో చర్మం ఎర్రగా మారుతుంది.
రోజూ తినొచ్చా...
మిర్చీ తినడం వల్ల జీవితకాల పరిమితి పెరుగుతుంది అంటున్నారు శాస్త్రవేత్తలు. మిరపకాయ తిన్నప్పుడు జీర్ణక్రియతో పాటు రక్త ప్రసరణను పెరుగుతుంది కాబట్టి శరీరంలో మృత కణాలు, వ్యర్థాలు వేగంగా బయటికొచ్చేస్తాయి.
మిర్చీతో చర్మ క్యాన్సర్ వ్యాధిబారినపడే ప్రమాదం తక్కువ.
విటమిన్లు, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలతో పాటు.. కొద్ది మొత్తంలో శక్తినిచ్చే క్యాలరీలు మిర్చీ సొంతం.
పొట్ట రాదు..
మిరపతో శరీర పనితీరు వేగమవుతుంది. కాబట్టి పొట్ట చుట్టు కొవ్వు పేరుకోకుండా చేస్తుంది. దీంతో ఎన్నో రకాల అనారోగ్యాల నుంచి తప్పించుకోవచ్చు.
శ్రుతిమించితే ప్రమాదమే..
పరిమితికి మించి తీసుకుంటే అమృతం కూడా విషమే అవుతుంది. పచ్చిమిర్చిని మోతాదుకు మించి తింటే, నోట్లో మంట. డయేరియా, జ్వరం, జీర్ణాశయ మంటలు కలుగుతాయి.అందుకే, గర్భవతులను పచ్చిమిర్చి అధికంగా తిననివ్వరు.
విదేశీయులు ఎక్కువగా మిర్చీ తినే సాహసం చేయరు. కానీ, మనోళ్లు మాత్రం రోజూ వంటకాల్లో కారం జోడిస్తారు. కారం ఆరోగ్యానికి మంచిదే కానీ, శ్రుతి మించకుండా చూసుకోవడమూ మన బాధ్యతే.
ఇదీ చదవండి: 'వెట్ వైప్స్'ను ఇలా వాడితే అంతే...!