సమస్య: కరోనా టీకా తీసుకునేవారు నొప్పి మందులు వేసుకోవద్దని, ప్రమాదకరంగా మారుతుందని కొందరు చెబుతున్నారు. ఇది నిజమేనా?
- పి.బి. లక్ష్మి, హైదరాబాద్
సలహా: కరోనా టీకా కూడా నిజం వైరస్ మాదిరిగానే రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తుంది. దీంతో తాత్కాలికంగా జ్వరం, కండరాల నొప్పులు, టీకా తీసుకున్న చోట నొప్పి వంటివి తలెత్తొచ్చు. ఇవి టీకా ప్రభావం చూపుతోందనటానికి సంకేతాలే. అయితే కొందరు టీకా వేయించుకోవటానికి ముందే నొప్పులు, జ్వరానికి భయపడి ఐబూప్రొఫెన్ వంటి ఎన్‌ఎస్‌ఏఐడీ రకం మందులు వేసుకుంటున్నారు. ఇది మంచిది కాదు. దీంతో రోగనిరోధక ప్రతిస్పందన తగ్గే అవకాశముందని, యాంటీబాడీలు అంతగా ఉత్పత్తి కావటం లేదని అధ్యయనాలు చెబుతున్నాయి.
నిజానికి టీకా తీసుకున్నాక జ్వరం, నొప్పుల వంటివి తలెత్తినా ప్రత్యేకించి నొప్పి మందుల అవసరం లేదు. మరీ ఎక్కువైతే వాడుకోవచ్చు గానీ అంత అవసరమేమీ రాదు. చాలావరకు పారాసిటమాల్ మాత్రలే సరిపోతాయి. అవసరమైతే వీటిని 650 మి.గ్రా. మోతాదులో ప్రతి 6 గంటలకు ఒకటి వేసుకోవచ్చు. నొప్పి మందులు వాడుకోవాలని ప్రముఖ ఆరోగ్యసంస్థలేవీ సిఫారసు చేయలేదు. పారాసిటమాల్‌తో ఫలితం కనిపించకపోతే నొప్పి మందులు వాడుకోవచ్చు. అందువల్ల అత్యవసరమైతేనే.. అదీ డాక్టర్ సలహా మేరకే తీసుకోవాలి. ఇప్పటికే ఇతరత్రా జబ్బుల కారణంగా నొప్పి మందులు వాడుకునేవారైతే ఆపాల్సిన అవసరం లేదు.
డా. ఎం. వి. రావు, జనరల్ ఫిజీషియన్
ఇదీ చదవండి: 'ఆ యాప్‌తో 33 రకాల వ్యాధుల వ్యాప్తి తెలుసుకోవచ్చు'