చర్మ సంరక్షణ విషయంలో ఆడవాళ్లు తీసుకునేంత శ్రద్ధ.. మగవారు తీసుకోరనేది నిజం. వారి బిజీ జీవితాల కారణంగా చర్మ సంరక్షణ కోసం సమయం కేటాయించడం అనేది చాలా కష్టమైన పని. పైగా మార్కెట్లోకి వచ్చిన ఉత్పత్తుల్లో తమ చర్మానికి తగినవి ఏంటో కూడా తెలియకపోవడం కూడా ఒకటి. కానీ కొన్ని మార్గాలను అవలంభించడం వల్ల చర్మాన్ని సంరక్షించుకోవచ్చు. దినచర్యలో భాగంగా ప్రతిరోజూ ఈ చిట్కాలను పాటిస్తే మీ చర్మం సురక్షితంగా ఉంటుందంటున్నారు నిపుణులు.
చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోండి
చర్మ సంరక్షణ విషయంలో పురుషులకు పెద్దగా పట్టింపు ఉండదు. ఒకవేళ దాని గురించి పట్టించుకున్నా ప్రతిరోజు జాగ్రత్తలు పాటించాలంటే మాత్రం చాలా ఇబ్బంది. చాలామంది పురుషులు నిద్రలో నుంచి లేచి వచ్చినట్లు కనిపిస్తుంటారు. ఇలా కనిపించకుండా ఉండాలంటే.. చర్మానికి సరిపోయే సున్నితమైన ఫేస్ వాష్ అవసరం. ఉదయం, సాయంత్రం పూట ఈ ఫేస్ వాష్‌తో కడుక్కుంటే చర్మం ప్రకాశవంతంగా, ఉత్తేజకరంగా ఉంటుంది.
మెరుపు కోసం మాయిశ్చరైజ్ చేయండి
చర్మ సంరక్షణ దినచర్యలో మాయిశ్చరైజింగ్ ఒక ముఖ్యమైన భాగం. ముఖ్యంగా కాలుష్యకర వాతావరణంలో తిరిగే వాళ్లు అయితే తప్పకుండా మాయిశ్చరైజ్ చేయాలి. అలాగే పొడి చర్మం కలిగిన వాళ్లు కూడా చర్మం కోసం మాయిశ్చరైజర్ వాడడం మంచిది. మాయిశ్చరైజింగ్ క్లెన్సింగ్ మీ చర్మం రోజంతా హైడ్రేట్‌గా ఉంచడానికి ఉపయోగపడుతుంది. అలాగే కఠినమైన వాతావరణాన్ని ఎదుర్కోవటానికి అవసరమైన అదనపు పోషణను అందిస్తోంది. 3 శాతం ఎన్ఎమ్ఎఫ్ కాంప్లెక్స్‌తో డీకన్ట్రక్ట్స్ హైడ్రేటింగ్ మాయిశ్చరైజర్ వంటి ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల మీ చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచవచ్చు.
ఎండ భయమెందుకు.. సన్ స్క్రీన్ ఉందిగా
సన్స్ స్క్రీన్ కేవలం మీ చర్మాన్ని హానికరమైన UV కిరణాల నుంచి రక్షించడమే కాకుండా సన్ డ్యామేజ్ నుంచి కూడా రక్షిస్తుంది. అలాగే వయసైనట్లు కనిపించే చర్మాన్ని, చర్మ క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడుతుంది. వాతావరణంతో సంబంధం లేకుండా.. రోజులో ఎక్కువ భాగం ఇంట్లో గడుపుతున్నప్పటికీ ప్రతిరోజూ సన్ స్క్రీన్ వాడాలి. మీ చర్మ రకానికి తగిన సన్ స్క్రీన్‌ను ఎంచుకోవడం కూడా చాలా ముఖ్యం. మీరు బయట ఎక్కువ సమయం గడుపుతుంటే ప్రతి 2-3గంటలకు ఒకసారి అప్లై చేసుకోవడం మర్చిపోవద్దు. కనీసం 30 ఎస్పీఎఫ్ ఉన్న సన్ స్క్రీన్‌ని ఎంచుకోండి.
రసాయనాలతో చర్మ సంరక్షణ
పురుషుల చర్మ సంరక్షణలో తేలికపాటి రసాయనాలను ఉపయోగించడం వల్ల మేలు కలుగుతుంది. దీని వల్ల చర్మంలో ఉండే రంధ్రాలతో పాటు మృత కణాలు బయటకు పంపడానికి వీలవుతుంది. పురుషులకు లాక్టిక్ ఆమ్లం, గ్లైకోలిక్ ఆమ్లం వంటి తేలికపాటి ఎహెచ్ఎలు కలిగిన రసాయనాలు వాడటం ఉత్తమం. వీటి వాడకం వల్ల చర్మానికి సున్నితత్వం లభించడమే కాకుండా చర్మంలోని మృత కణాల శుద్ధి జరుగుతుంది. అంతేకాకుండా చర్మానికి మెరుపు వస్తుంది. చర్మం పొడిబారకుండా ఉండటం కోసం మాయిశ్చరైజర్‌తో పాటు రసాయన ఎక్స్ఫోలియంట్లను వాడటం మంచిది. వీటిని ఉపయోగించేటప్పుడు సన్ స్క్రీన్ వాడాలని గుర్తుంచుకోండి. ఎందుకంటే అవి సన్ సెన్సిటివిటిని పెంచుతాయి.
సరైన ఆహారం తీసుకోండి
చర్మ సంరక్షణ విషయంలో బయట నుంచి ఎన్ని రకాల ఉత్పత్తులను వాడినా.. కానీ శరీరం ద్వారా అందాల్సిన సరైన పోషకాలు అందకపోతే ఎలాంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి ఉత్తమ ఫలితాల కోసం విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. సరైన పోషకాలు కలిగిన ఆహారం చర్మంలో మంటను తగ్గించడానికి.. చర్మం సాగే గుణాన్ని కలిగి ఉండటానికి సహాయపడుతుంది. కాబట్టి మీరు తీసుకునే ఆహారంపై శ్రద్ధ వహించండి. ప్రాసెస్ చేసిన, వేయించిన ఆహారాలు ఎక్కువగా తినడం వల్ల మొటిమలతో పాటు ఇతర చర్మ సమస్యలు వస్తాయి. సమతుల్య ఆహారం తీసుకోవడం, విటమిన్లు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను తీసుకోవడం ద్వారా చర్మాన్ని సంరక్షించుకోవచ్చు.
మన బిజీ జీవితాల వల్ల చర్మ సంరక్షణ మీద ప్రత్యేక దృష్టి పెట్టేందుకు సమయాన్ని కేటాయించలేక పోతున్నాం. క్రమం తప్పకుండా చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవడం, తేమ నిలువ ఉండేలా జాగ్రత్తపడటం, సూర్యకాంతి నుంచి రక్షించుకోవడం, అలాగే కొన్ని రకాల రసాయనాలను వినియోగించడమే కాకుండా సరైన పోషకాహారాన్ని తీసుకోవడం ద్వారా చర్మాన్ని రక్షించుకోవచ్చు. కాబట్టి ఈ చర్మ సంరక్షణ చిట్కాలను ఇప్పుడే మొదలుపెట్టండి.