కరోనా వైరస్ మనిషి శరీరంలోకి వెళ్లకుండా ముక్కు వద్దే నిర్వీర్యం చేసేలా సరికొత్త జిగురు మందును ఐఐటీ బాంబే (డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోసైన్సెస్ అండ్ బయోఇంజినీరింగ్) అభివృద్ధి చేస్తోంది. దీన్ని నాసికా రంధ్రాల వద్ద పూసుకుంటే వైరస్‌ను అక్కడే చంపేస్తుంది. ఈ జిగురు తయారీకి కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వశాఖ ఆర్థికసాయం అందిస్తోంది. ఈ మందు వైద్య ఆరోగ్య సిబ్బంది భద్రతను మరింత పెంచడంతోపాటు, కొవిడ్-19 సామూహిక సంక్రమణం చెందకుండా నిరోధిస్తుందని ఆ శాఖ తెలిపింది.
వైరస్‌లు ఊపిరితిత్తుల్లోకి చేరకుండా నిరోధించడం తమ తొలి వ్యూహమని పేర్కొంది. దీంతో ఇన్‌ఫెక్షన్ తగ్గుతుందని తెలిపింది. రెండో దశలో జీవకణాలను (బయలాజికల్ మాలిక్యూల్స్) జొప్పించి తద్వారా లోపల చిక్కుకుపోయిన వైరస్‌లను డిటర్జెంట్ల తరహాలో నిర్వీర్యం చేయాలనుకుంటున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కార్యదర్శి అశుతోష్‌కుమార్ మాట్లాడుతూ కొవిడ్-19పై పోరాడుతున్న మన వైద్య సిబ్బంది రక్షణను ఐఐటీ బాంబే రూపొందిస్తున్న జిగురు మరో అంచె పెంచుతుందని పేర్కొన్నారు.
ఐఐటీ బాంబే ప్రొఫెసర్లు కిరణ్ కొండబాగిల్, రిత్ని బెనర్జీ, అశుతోష్‌కుమార్, షామిక్‌సేన్ ప్రస్తుతం ఈ ప్రాజెక్టుపై పనిచేస్తున్నారు. ఈ కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని 9 నెలల్లో అందుబాటులోకి తేనున్నట్లు కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ తెలిపింది.