'కరోనా వైరస్ వల్ల యువకులకు పెద్ద ప్రమాదమేమీ లేదన్న ఆలోచన పూర్తిగా అసత్యమైనది' అని తాజాగా చేపట్టిన ఓ అధ్యయనంలో స్పష్టమైంది. చిన్నారులు, కౌమార ప్రాయంలోనివారు, యువకులకే కొవిడ్-19 వల్ల ఎక్కువ ప్రమాదం పొంచి ఉందని తాజా అధ్యయనం పేర్కొంది.
అమెరికాలోని రట్జర్స్ వర్సిటీకి చెందిన లారెన్స్ క్లీన్మాన్ ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి.. కరోనా మహమ్మారి వల్ల మరింత ప్రమాదం పొంచి ఉందని ఆయన స్పష్టం చేశారు.
జామా పీడియాట్రిక్స్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం, ఊబకాయం లాంటి సమస్యలతో బాధపడే చిన్నారులు కరోనా బారిన పడే ప్రమాదం చాలా ఎక్కువ. అనారోగ్యం లేని చిన్నారులను సైతం కరోనా వదిలిపెట్టదని ఈ అధ్యయనంలో పాల్గొన్న లారెన్స్ క్లీన్మాన్ స్పష్టం చేశారు.
అధ్యయనం ఇలా...
యూఎస్, కెనడాల్లోని పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేరిన 48 మందిపై శాస్త్రవేత్తలు రెండు నెలలపాటు అధ్యయనం చేశారు. వీరిలో అప్పుడే పుట్టిన శిశువు నుంచి 21 ఏళ్ల యువకుల వరకు ఉన్నారు.
- ఆశ్చర్యకరంగా 80 శాతం కంటే ఎక్కువ మంది పిల్లల్లో రోగనిరోధక శక్తి క్షీణత, ఊబకాయ, మధుమేహం, మూర్ఛ, దీర్ఘకాలిక ఊపరితిత్తుల సమస్యలున్నాయని గుర్తించారు.
- 40 శాతం మంది.. పెరుగుదల సమస్యలతో మనుగడ సాగిస్తున్నట్లు తెలిసింది.
- 20 శాతానికిపైగా రెండు అంతకంటే ఎక్కువ అవయవ వ్యవస్థల వైఫల్యం ఎదుర్కొంటున్నారు. దాదాపు 40 శాతం మంది శ్వాసనాళాలు, వెంటిలేటర్‌పై ఆధారపడుతున్నారు.
- నిజానికి ఇప్పుటి వరకు 33శాతం మంది చిన్నారులు... కొవిడ్-19 కారణంగా ఆసుపత్రి పాలయ్యారు. అధ్యయన కాలంలో ఇద్దరు చిన్నారులు మరణించారు.
- కొవిడ్-19 ఉన్న పిల్లల్లో గుండె ఆగిపోయే ప్రమాదం కూడా ఉంది. దీనినే పీడియాట్రిక్ మల్టీ సిస్టమ్ ఇన్‌ఫ్లేమేటరీ సిండ్రోమ్ అంటారు.
కొంత నయం...
కరోనా వ్యాధితో ఐసీయూలో చేరిన పెద్దల్లో మరణాల రేటు 62 శాతం ఉండగా, పీఐసీయూ(పీడియాట్రిక్ ఐసీయూ)లో రోగుల మరణాల రేటు 4.2 శాతంగా ఉందని అధ్యయనం పేర్కొంది.
ఇదీ చూడండి: వాసన గుర్తించే కణాల వల్లే కరోనా వ్యాప్తి!