యాదాద్రి ఆలయం(yadadri sri lakshmi narasimha swamy temple)లో వర్షంకారణంగా బయటపడిన లోపాల మరమ్మతులపై అధికారులు దృష్టిపెట్టారు. రెండో ఘాట్ రోడ్డులో కొండపై నుంచి దొర్లి పడ్డ రాళ్లను తొలగించి... రాకపోకలకు అనుమతిస్తున్నారు. కొండపై ఉత్తరదిశలో వర్షం కారణంగా రక్షణ గోడ వద్ద మట్టి కొట్టుకుపోవడంతో యంత్రాలతో చదును చేస్తున్నారు. ఆలయ నిర్మాణాలు, కొండ కింద వైకుంఠ ద్వారం వద్ద నిలిచిన వర్షపు నీటిని తొలగించి సిమెంట్ కాంక్రీట్ చేస్తున్నారు. కొండపై క్యూ కాంప్లెక్స్ మరమ్మతులు కూడా కొనసాగుతున్నాయి. మరోవైపు.... యాదాద్రికి అనుబంధ ఆలయంగా కొనసాగుతున్న శివాలయ పునర్నిర్మాణంలో భాగంగా తెచ్చిన ధ్వజ స్తంభం కర్రను యాడా అధికారులు ఎట్టకేలకు భద్రపరిచారు. కర్ర ఎండకు ఎండుతూ.. వానకు నానుతూ పగుళ్లు వచ్చింది. ఈ లోపాలపై 'ఈటీవీ భారత్'లో Yadadri Leakage: యాదాద్రి అష్టభుజ మండప ప్రాకారాలలో లీకేజీలు కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన యాడా అధికారులు మరమ్మతులు చేపట్టారు.
ధ్వజస్తంభం సేఫ్
యాదాద్రిలో అనుబంధ ఆలయంగా కొనసాగుతున్న శివాలయ పునర్నిర్మాణంలో భాగంగా తీసుకొచ్చిన ధ్వజ స్తంభం కర్ర (దూలం)ను ఎండలో ఉండగా... ఎట్టకేలకు భద్రపరిచారు. ఆ కర్రకు పగుళ్లు వచ్చిన విషయంపై అధికారులు స్పందించారు. ధ్వజస్తంభం కర్రను శివాలయ ప్రాకార మండపంలోకి చేర్చారు.
![yadadri reconstruction works, sri lakshmi narasimha swamy temple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-nlg-81-25-yadadri-etv-spandhana-av-ts10134_25072021085957_2507f_1627183797_592.jpg)
కాంక్రీట్ పనులు
ఎడతెరిపి లేకుండా కురిసిన వానలతో ఆలయ నిర్మాణాల నుంచి వర్షపు నీరు ప్రవహించింది. యాదాద్రి అష్టభుజ మండప ప్రాకారాలలో లీకేజీలు ఏర్పడగా చర్యలు చేపట్టారు. కొండపై ఉత్తరదిశలో రక్షణ గోడ వద్ద కొట్టుకుపోయిన మట్టిని... మళ్లీ పోసి యంత్రాలతో చదును చేస్తున్నారు. ఆలయ నిర్మాణాలు, కొండ కింద వైకుంఠ ద్వారం వద్ద నిలిచిన వర్షపు నీటిని తొలగించి సిమెంట్ కాంక్రీట్‌తో మరమ్మతులు చేస్తున్నారు.
![yadadri reconstruction works, sri lakshmi narasimha swamy temple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12565582_temple.png)
ఘాట్ రోడ్ క్లియర్
వర్షం కారణంగా యాదాద్రి రెండో ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. మూడు రోజుల క్రితం రెండో ఘాట్ రోడ్డులో పక్కన ఉన్న కొండపై నుంచి దొర్లి పడ్డ బండ రాళ్లను తొలగించారు. మరమ్మతులు చేసి రాకపోకలకు అనుమతిస్తున్నారు. కొండపై క్యూ కాంప్లెక్స్ మరమ్మత్తులు కూడా కొనసాగుతున్నాయి.
![yadadri reconstruction works, sri lakshmi narasimha swamy temple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-nlg-81-25-yadadri-etv-spandhana-av-ts10134_25072021085957_2507f_1627183797_873.jpg)
పసిడి వర్ణం
ఇది ఇలా ఉండగా ఆలయ పునర్నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. కృష్ణశిలతో రూపొందిన యాదాద్రి పంచనారసింహుల ఆలయ సన్నిధిలో పసిడి వర్ణంలో వివిధ వనరులను సమకూరుస్తున్నారు. స్తంభోద్భవుడి సన్నిధి సహజసిద్ధంగా ఆవిష్కృతం కావాలన్నదే సీఎం కేసీఆర్ ప్రధానాశయం. ఒకే జాతికి చెందిన కృష్ణశిలతో పంచనారసింహులు కొలువైన ఆలయ ప్రాంగణాన్ని రూపొందించారు. ఇంకెక్కడా లేని తరహాలో అష్టభుజ మండప ప్రాకారాలతో నిర్మితమైన ఈ ఆలయ విశిష్టత నలుదిశలా వ్యాపించేలా వివిధ వనరుల కల్పనకు వైటీడీఏ(యాదాద్రి ఆలయ ప్రాధికార సంస్థ) శ్రమిస్తోంది. అద్దాల మండపం, దర్శన వరుసలతో కూడిన మందిరం, రాజగోపురాల ద్వారాలకు తలుపులు, ప్రత్యేక విద్యుద్దీకరణ పనులు జరుగుతున్నాయి. ఇదీ చదవండి: పసిడి వర్ణంలో మెరిసిపోతున్న 'యాదాద్రి'
తుది మెరుగులు
తుదిదశకు చేరుకున్న క్షేత్రాభివృద్ధి పనులు ఏమేరకు పూర్తయ్యాయో ఫొటోలతో సహా సమాచారాన్ని సీఎం కేసీఆర్ సేకరిస్తున్నట్లు సమాచారం. దీంతో యాడా యంత్రాంగం యాదాద్రి క్షేత్ర పరిధిలో చేపట్టిన పనులను మరింత వేగవంతం చేసింది. ఇప్పటికే చాలాసార్లు సీఎం కేసీఆర్.. క్షేత్ర సందర్శనకు వచ్చిన విషయం విదితమే. ఆలయాభివృద్ధిలో భక్తులకు అవసరమయ్యే వనరులను పూర్తిస్థాయిలో కల్పించాలని.. రెండున్నర నెలల్లో ఆ పనులన్నింటినీ పూర్తి చేయాలని ఆదేశించడంతో యాడా ఎప్పటికప్పుడు పనుల పురోభివృద్ధిపై దృష్టి సారించింది. ఇదీ చదవండి: తుది మెరుగులు దిద్దుకుంటోన్న యాదాద్రి..
ఇవీ చదవండి: