78 రోజుల తర్వాత యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి రేపటి నుంచి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ప్రభుత్వ ఆదేశాలు, మార్గదర్శకాలతో బాలాలయ పరిసరాలను తీర్చిదిద్ది దర్శనాలకు సిద్ధం చేస్తున్నామని యాదాద్రి భువనగిరి కలెక్టర్ అనితా రామచంద్రన్ వెల్లడించారు.
పర్యటక శాఖ అతిథిగృహంలో పోలీసులు, రెవెన్యూ, ఆరోగ్య, ఆలయ అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. ఏర్పాట్లపై సమీక్షించి నిబంధనలను వివరించారు. ధర్మ దర్శనం మాత్రమే ఉంటుందని 8న ప్రయోగాత్మకంగా ఆలయం విశ్రాంత ఉద్యోగులతో పాటు స్థానికులకు దర్శనాలు కల్పించి పరిశీలిస్తామని ఆలయ ఈఓ గీతారెడ్డి తెలిపారు. 9న నుంచి భక్తులందరికీ ఉచిత లఘు దర్శన సదుపాయం కల్పిస్తామని వివరించారు. ఆర్జిత పూజల్లో భక్తులను అనుమతించే తీరును ఆ రోజే నిర్ణయిస్తామని తెలిపారు.
యాదాద్రి క్షేత్రంలో లడ్డూ, పులిహోర ప్రసాదం ప్రత్యేక ఏర్పాట్ల మధ్య భక్తులకు విక్రయిస్తారు. స్థలాభావం లాక్ డౌన్ నిబంధనలను అనుసరించి బాలాలయంలో ఆర్జిత పూజలను పరిమితం చేసే యోచనలో అధికారులు ఉన్నారు.