యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని గాంధీనగర్లో వలయ రహదారి విస్తరణ పనులు చకచకా సాగుతున్నాయి. కానీ ప్రభుత్వ పాఠశాలకు వెళ్లే దారి అయోమయంగా మారింది. పది అడుగుల ఎత్తులో చేపడుతున్న నిర్మాణంపై అనేక సందేహాలు కలుగుతున్నాయి అంటున్నారు స్థానికులు. ఈ రోడ్డుతో పాఠశాల లోతులో ఉన్నట్లు కనిపిస్తోందని వాపోయారు. సాధారణంగా వర్షాలు వస్తే పాఠశాల ఆవరణ కుంటను తలపిస్తుందని... వలయ రహదారి పనులతో పాఠశాల ప్రశ్నార్థకంగా మారిందని చెబుతున్నారు.
పాఠశాలను వేరే ప్రాంతంలో ఏర్పాటు చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయమై అధికారులను వివరణ కోరగా... పాఠశాలను మరో చోటికి మార్చే అవకాశం ఉన్నట్లు తెలిపారు. పట్టణంలోని బస్టాండ్ వద్ద ఉన్న ప్రభుత్వ బాలికలు, బాలుర ఉన్నత పాఠశాలను యాదగిరిగుట్ట దేవస్థానం స్వాధీనం చేసుకొని పాత గోశాలకు మార్చారు. ఇప్పుడు వలయ రహదారి విస్తరణతో పాఠశాల స్థితిపై అయోమయం నెలకొంది. పాఠశాలకు ఇబ్బందులు ఎదురవుతాయని అధికారులకు పలువురు నాయకులు గతంలోనే వినతి పత్రాలు అందజేశారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని గుర్తు చేశారు.
ఇదీ చదవండి: దేశాన్ని రక్షించాలంటే.. ఇకనైనా కళ్లు తెరవాలి!