ఆగస్టు 5న నిర్వహించనున్న అయోధ్య రామమందిర భూమిపూజలో దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాల నుంచి మట్టి, పవిత్ర జలాలను వినియోగించనున్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో గోశాలలోని తులసీవనం నుంచి మట్టి, పవిత్ర జలాలను సేకరించిన వీహెచ్పీ ఉమ్మడి నల్గొండ జిల్లా సహాయ కార్యదర్శి తోట భానుప్రసాద్ వాటిని రాష్ట్ర వీహెచ్పీ కార్యాలయానికి పంపించారు.
తులసీవనం నుంచి సేకరించిన మట్టి, పవిత్ర జలాలకు స్వామి సన్నిధిలో ప్రత్యేక కలశ పూజలు నిర్వహించి హైదరాబాద్లోని విశ్వహిందూ పరిషత్ తెలంగాణ కార్యాలయానికి పంపించామని భాను ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వీహెచ్పీ జిల్లా ఉపాధ్యక్షులు పొత్నక్ రాఘవేందర్, జిల్లా సహాయ కార్యదర్శి కర్రె ప్రవీణ్, హిందూ వాహిణి జిల్లా అధ్యక్షుడు గీస ఆనంద్, భజరంగ్ దల్ జిల్లా సంయోజక్ కోకల సందీప్, భువనగిరి పట్టణ అధ్యక్షుడు ఛామ రవీందర్, భువనగిరి మండల అధ్యక్షుడు సుక్కల శ్రీశైలం యాదవ్ పాల్గొన్నారు.