యాదాద్రి క్షేత్ర అభివృద్ధి(Yadadri lakshmi narasimha swamy temple news)లో భాగంగా కొండ కింద నిర్మిస్తున్న పుష్కరిణి పనులు చివరిదశకు చేరుకున్నాయి. ఒకేసారి 2,500 మంది స్నానమాచరించే సదుపాయంతో గండిచెరువు పరిసరాల్లో రూ.11.55 కోట్ల అంచనా వ్యయంతో 2.47 ఎకరాల విస్తీర్ణంలో లక్ష్మీ పుష్కరిణి నిర్మాణం సాగుతోంది. 8 అడుగుల లోతు, 150 అడుగుల పొడవు, 50 అడుగుల వెడల్పుతో నిర్మించిన ఈ పుష్కరిణిలో 20 లక్షల లీటర్ల నీటిని నిల్వ చేయవచ్చు. ఇప్పటికే నిల్వ సామర్థ్య పరీక్షలు పూర్తి చేశారు. నీటి సౌకర్యం కోసం పైపులు, మోటార్లను ఏర్పాటుచేశారు. ఇటీవల నీటిని శుద్ధి చేసే ఫిల్టర్లను ప్రయోగాత్మకంగా పరిశీలించారు. పుష్కరిణి వద్ద దుస్తులు మార్చుకునే గదుల నిర్మాణం పూర్తయింది.
పుష్కరిణి నలువైపులా సరికొత్తగా విద్యుద్దీపాల ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ దృఢ సంకల్పంతో యాదాద్రి క్షేత్రం(Yadadri lakshmi narasimha swamy temple news) మహా దివ్యంగా రూపొందుతోంది. ఆలయ దేవుడి కైంకర్యాల నిర్వహణకు పునరుద్ధరిస్తున్న పుష్కరిణిని శోభాయమానంగా తీర్చిదిద్దే పనుల్లో భాగంగా, ఇత్తడి వొంకులతో వైష్ణవ తత్వం ప్రస్ఫుటించేలా విద్యుద్దీపాల బిగింపు చర్యలు అధికార యంత్రాంగం చేపట్టారు.
రక్షణ గోడపై మందిర రూపం
జయపుర కటౌట్లతో దేశం గర్వించేలా... రాష్ట్రానికి వన్నె తెచ్చేలా యాదాద్రి పంచ నారసింహుల పుణ్యక్షేత్రాన్ని మహా దివ్యంగా తీర్చిదిద్దుతున్నారు. స్వయంభువుగా వెలసిన శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధాన ఆలయ(Yadadri lakshmi narasimha swamy temple news) విస్తరణకు నిర్మించిన రక్షణ గోడను సంప్రదాయంగా తీర్చిదిద్దేందుకు రాజస్థాన్‌కు చెందిన జయపుర నుంచి ఆలయ రూపంతో కూడిన కటౌట్లను తెప్పించారు. ఇప్పటికే దక్షిణ దిశలోని రక్షణ గోడకు ఐరావతం కటౌట్లను బిగించిన విషయం తెలిసిందే. అదే తరహాలో నరసింహ స్వామి విగ్రహ రూపంతో పాటు జయ, విజయులు, ఆ పక్కన స్వాగతించే దీప కన్యలు ఆ పైన వైష్ణవ చిహ్నాలు, శంఖు, చక్ర, తిరునామాలు, విమాన గోపురాలు గల ఆ కటౌట్లు రక్షణ గోడపై ఆవిష్కృతం కానున్నాయి.