సుప్రసిద్ధ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 15 నుంచి ప్రారంభమవనున్నాయి. మార్చి 25వరకు జరగనున్న ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు. యాదాద్రిలో ఏటా ఫాల్గుణ మాసంలో పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారం ఈ వేడుకలను నిర్వహించడం ఆనవాయితీ. ఈసారి 15 నుంచి మొదలయ్యే బ్రహ్మోత్సవాలను తొలిరోజు విశ్వక్సేన ఆరాధనతో శ్రీకారం చుట్టనున్నారు. రెండో రోజు ధ్వజారోహణతో పాటు మూడో రోజు నుంచి అలంకరణ సేవోత్సవాలు జరగనున్నాయి.
![yadadri temple eo invites governor tamilisai to annual brahmotsavam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-nlg-85-12-governor-ku-usthavala-aahwanam-av-ts10134_13032021052718_1303f_1615593438_804.jpg)
21వ తేదీ నుంచి విశేష ఉత్సవాలు ప్రారంభమవుతాయి. వీటిలో 21న ఎదుర్కోళ్లు, 22న యాదగిరీశుడి తిరు కల్యాణోత్సవం, 23న దివ్య విమాన రథోత్సవం కనులవిందుగా జరగనుంది. 24న శ్రీచక్ర తీర్థ స్నానం జరగనుండగా, 25న అష్టోత్తర శతఘట అభిషేకాలతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. కాగా, స్వామివారి తిరు కల్యాణోత్సవానికి రాష్ట్ర పెద్దలను ఆహ్వానించినట్లు ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు. ఈనెల 22న బాలాలయంలో జరగనున్న స్వామివారి తిరుకల్యాణానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిలతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులకు ఆహ్వాన పత్రాలు అందజేసినట్లు వివరించారు.
![yadadri temple eo invites governor tamilisai to annual brahmotsavam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-nlg-85-12-governor-ku-usthavala-aahwanam-av-ts10134_13032021052718_1303f_1615593438_498.jpg)
- ఇదీ చూడండి : రాష్ట్రంలో రెండోరోజు కొనసాగిన మహాశివరాత్రి వేడుకలు