ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా పునర్మిస్తున్న యాదాద్రి క్షేత్రం వడివడిగా రూపుదిద్దుకుంటోంది. ఒక్కో పనిని పూర్తి చేస్తూ ప్రారంభానికి ఆలయాన్ని సిద్ధం చేస్తున్నారు. ఇవాళ యాదాద్రిలో లైటింగ్ డెమో నిర్వహించారు. స్వర్ణకాంతులతో లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం విరాజిల్లుతోంది. యాదాద్రిలో సరికొత్త హంగులతో కూడిన విద్యుత్ దీపాలను అలంకరించారు. యాదాద్రి ప్రధానాలయానికి సరికొత్త హంగులతో కూడిన విద్యుత్ దీపాల అలంకరణ ఆలయ ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి, పర్యవేక్షణలో ప్రత్యేక లైటింగ్ ఏర్పాట్లను ట్రయల్ రన్ డెమోను చేపట్టారు. విద్యుత్ కాంతులతో ఆలయ గోపురాలు, మండపాలు, స్వర్ణ కాంతులుగా వెలుగొందుతున్నాయి. పసిడి వర్ణంలో విద్యుత్ దీప కాంతులతో ఆలయం దేదీప్యమానంగా వెలుగొందింది.
విశ్వ క్షేత్రంగా వెలుగొందుతున్న యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయాన్ని ప్రత్యేక హంగులతో తీర్చిదిద్దుతున్నారు. ఆలయ పునర్నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయి. తూర్పు, ఉత్తర రాజ గోపురానికి, అష్ట భుజ మండపం ప్రాకారాలకు, గర్భాలయ విమాన గోపురానికి, సాలహారాల్లో పొందుపరిచిన విగ్రహాలకు, పసిడి వర్ణపు కాంతులు విరజిమ్మాయి. పసుపు వర్ణంతో యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం కనువిందు చేసింది. బంగారు వర్ణంలో ఉన్న ఈ దృశ్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమాన్ని మంత్రి జగదీశ్ రెడ్డి, సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్, ఈఎన్సీ రవీందర్ రావు, యాడ వైస్ ఛైర్మన్ కిషన్ రావు అధికారులు పరిశీలించారు.