రాష్ట్రానికే వన్నె చేకూర్చే తరహాలో రూపొందుతున్న శ్రీ లక్ష్మీనృసింహుని క్షేత్ర నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇటీవల సీఎం కేసీఆర్ పర్యటించి దిశానిర్దేశం చేయడంతో అధికారులు పనుల్లో వేగం పెంచారు. ప్రధానాలయంతో పాటు అనుబంధ శివాలయం పునర్నిర్మాణం పూర్తికావొచ్చింది. ఉత్తరదిశ పనులు గడువులోగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించడంతో పనులను మరింత వేగవంతం చేశారు.
పూర్తికావొచ్చిన విష్ణు పుష్కరిణి పనులు...
విష్ణు పుష్కరిణి పునరుద్ధరణ పనులు త్వరలోనే పూర్తవుతాయని ఈఈ వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఆలయానికి పడమటి దిశలో రక్షణగోడ నిర్మాణ పనులు సాగుతున్నాయి. శివాలయం ఎదుట కాలినడకన వచ్చే భక్తుల కోసం మెట్లదారితో పాటు వాహనాల రాకపోకలకు రోడ్డు నిర్మాణ పనులు కొనసాగిస్తున్నారు. బాలాలయం చెంత చేపట్టిన పైపుల ఏర్పాట్ల పనులు సాగుతున్నాయి.
హైందవ సంస్కృతి ఉట్టి పడేలా...
వీఐపీల కోసం ఏర్పాటు అవుతున్న లిఫ్ట్ ప్రవేశ మార్గంలో స్వాగత తోరణం నిర్మితమవుతోంది. సదరు తోరణానికి హైందవ సంస్కృతిని చాటే చిహ్నాలు, స్వామి వారి రూపాన్ని పొందుపరుస్తున్నారు. సిమెంట్‌తో కళాత్మకంగా ఆధ్యాత్మికత ఉట్టిపడే తీరులో ఆ పనులను నిర్వహిస్తున్నారు. పనులను ఎస్‌ఈ వసంత నాయక్, ఈఈ వెంకటేశ్వర్‌రెడ్డి పర్యవేక్షించారు.
తోరణంపై శివపార్వతుల విగ్రహం...
పడమటి దిశలో నిర్మితమవుతున్న రక్షణ గోడ నిర్మాణంలో భాగంగా సిమెంట్ ఫిల్లింగ్ పనులు చేపట్టారు. కొండపై నిర్మితమవుతున్న రామలింగేశ్వరుడి ఆలయం ఎదుట స్వాగత తోరణం శైవ ఆచారాలతో నిర్మిస్తున్నారు. తోరణంపైన నందిపై శివపార్వతుల విగ్రహ రూపాన్ని ఏర్పరిచే పనులను చేపట్టారు.
పూర్తయిన పనులు...
ఇప్పటికే సప్త గోపురాలతో పంచనారసింహులు కొలువుండే ప్రధానాలయం, గర్భాలయం ఎదుట 12 మంది ఆళ్వారుల శిల్పాలతో కూడిన మహా ముఖ మండపం, రాజగోపురాలు, దివ్య విమాన గోపుర నిర్మాణం, మహా ముఖ మండపం ఎదుట ఆండాళమ్మ, రామానుజుడు, ఆళ్వారుల విగ్రహాలు, క్షేత్రపాలక ఆంజనేయస్వామి ఉప ఆలయాల నిర్మాణాలు, గర్భాలయం ప్రవేశ ద్వారంపై శంకు, చక్ర నామాలు, గరుడ ఆళ్వార్లు, ఆంజనేయస్వామి విగ్రహాలు పూర్తయ్యాయి.
ప్రాజెక్టు వ్యయం..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టును రూ.1200 కోట్ల అంచనా వ్యయంతో 2016 అక్టోబరు 11న ప్రారంభించారు. ప్రస్తుత ధరల ప్రకారం ప్రాజెక్టు వ్యయం పెరిగే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ఇదీ చదవండి: కాంతులీనుతున్న యాదాద్రి