ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. గత నెలలో ఆలయాన్ని సందర్శించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశాలతో పనులు ఊపందుకున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి పర్యటనకు వచ్చేసరికి దిగువన నిర్మిస్తున్న ప్రెసిడెన్షియల్ సూట్ నిర్మాణం పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. దానితో పాటు ఆరు వరసల వలయ రహదారి నిర్మాణం వేగంగా జరుగుతుంది. ఆలయ మాడవీధుల్లో ఫ్లోరింగ్‌తో పాటు, రథశాల, ఎస్కలేటర్ కోసం సివిల్ పనులు కొనసాగుతున్నాయి. విద్యుత్ డ్రైనేజీ ఏర్పాటు చేస్తున్నారు. శివాలయ పునర్నిర్మాణంలో ఉప ఆలయాలకు సాంప్రదాయ హంగులద్దుతున్నారు.
ఆకర్షణీయంగా అద్దాల మండపం..
యాదాద్రి ప్రధానాలయం వాయువ్య దిశలో అద్దాల మండపం పనులు చకచకా జరుగుతున్నాయి. హైదరాబాద్‌కు చెందిన ఓ భక్తుడి సహకారంతో దీనిని నిర్మిస్తున్నారు. స్వామి వారి వివిధ రూపాలతో ప్రత్యేక ఆకర్షణగా ఈ నిర్మాణం సాగుతుంది.
త్వరలో గుట్టకు సీఎం కేసీఆర్?
ఆలయ నిర్మాణ పనులను నాలుగు నెలల క్రితం పరిశీలించిన ముఖ్యమంత్రి కేసీఆర్... మిగిలిన వాటిని వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. కొండపై కట్టడాలు పూర్తైతే స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను ఈసారి ప్రధాన ఆలయంలోని జరపాలని యోచిస్తున్నారు. స్వయంగా తానే ఆలయ అభివృద్ధిని పర్యవేక్షించి... చిన్న జీయర్ స్వామితో శుభ ముహూర్తం ఖరారు చేసేందుకు ముందస్తుగా... యాదాద్రికి వారం పది రోజుల్లో వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇదీ చూడండి: 'యాదాద్రి సీఎం కలల ప్రాజెక్టు'