Yadadri collector donated cycles to girls: విద్యార్థినులకు ఇచ్చిన హామీని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి నెరవేర్చారు. ఇచ్చిన మాట ప్రకారం నేడు ఆ ముగ్గురు విద్యార్థినులకు సైకిళ్లు అందజేశారు. భువనగిరి మండలం గౌస్ నగర్‌కు చెందిన ఎన్. స్పూర్తి, వి. రేవతి, పి. హారిక అనే ముగ్గురు విద్యార్థినులు గౌస్ నగర్ నుంచి బండసోమారం జిల్లా పరిషత్ హై స్కూల్‌కు నడుచుకుంటూ వెళ్తారు. వారి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో.. ప్రైవేటు వాహనాల్లో వెళ్లే స్తోమత లేక కష్టమైనా నడక మార్గం ఎంచుకున్నారు. అలా దాదాపు వాళ్లు బడికి వెళ్లేటప్పుడు మూడు కి.మీలు నడవాల్సి ఉంటుంది. అన్ని కి.మీలు నడవాలంటే ఉదయాన్నే లేవడం మాత్రం తప్పనిసరి. ఆ రెండు గ్రామాల మధ్య బస్సు సౌకర్యం కూడా లేకపోవడంతో.. ప్రతి రోజూ నడుచుకుంటూనే వెళ్లేవారు.
మూడు నెలల్లో
ఈ క్రమంలో గతేడాది నవంబర్ 30న ఆ మార్గంలో వెళ్తున్న కలెక్టర్ పమేలా సత్పతి.. మార్గమధ్యలో పాఠశాలకు నడుచుకుంటూ వెళ్తున్న విద్యార్థినులను గమనించి పలకరించారు. మూడు కిలోమీటర్లు నడిచి వెళ్తున్న విద్యార్థినుల అవస్థ చూసి సైకిళ్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా మంజూరైన సైకిళ్లను.. నేడు కలెక్టర్ కార్యాలయంలో ఆ ముగ్గురు విద్యార్థినులకు అందజేశారు. బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని వారిని ఆశీర్వదించారు. స్వయంగా కలెక్టరే తమ పరిస్థితి గమనించి సైకిళ్లు ఇవ్వడం పట్ల విద్యార్థినులు, బండ సోమారం జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు విజయేందర్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: "ఉద్యోగాలు లేక ఆటోలు నడుపుతున్నాం.. ఇప్పుడు సిటీలో నడపొద్దంటే ఎలా.?"