యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఫిబ్రవరి 26న స్వస్తివాచనంతో ప్రారంభమైన ఉత్సవాలు 11 రోజుల పాటు ఘనంగా జరిగాయి. శనివారం రాత్రి శృంగార డోలోత్సవంతో వేడుకలు ముగిశాయి.
వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజున స్వామి, అమ్మవార్లను వజ్రవైడుర్యాలు, వివిధ రకాల పుష్పాలతో నయన మనోహరంగా అలంకరించారు. వేద మంత్రాలు, మంగళ వాద్యాల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించి డోలోత్సవాన్ని నిర్వహించారు. అత్యంత ప్రాముఖ్యత కలిగిన డోలోత్సవ ప్రత్యేకతను ఆలయ అర్చకులు భక్తులకు వివరించారు. కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు.