యాదాద్రి భువనగిరి జిల్లాలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. బాలాలయంలోని మండపంలో స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణ పూజలు కనుల పండువగా నిర్వహించారు.
ధ్వజపటంపై గరుత్మంతునికి ప్రత్యేక పూజలు నిర్వహించి గరుడ ముద్దలు భక్తులకు అందజేశారు. వేదమంత్రాలు, మంగళవాద్యాల నడుమ వేడుకలను వైభవంగా నిర్వహించారు ఆలయ అర్చకులు. యాగశాలలో ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం భేరిపూజ, దేవతాహ్వానం నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో గీతారెడ్డి, ఛైర్మన్ నరసింహమూర్తి, భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. ఈనెల 15వ తేదీన స్వస్తివాచనంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 25న అష్టోత్తర శతఘటాభిషేకంతో ముగియనున్నాయి.