దేవరకొండ మినహా మిగతా నల్గొండ, సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్, మిర్యాలగూడ, భువనగిరి మున్సిపాలిటీల్లో పెరిగిన వార్డులకు అనుగుణంగా ఓటర్ల సంఖ్యను కుదిస్తూ వార్డులను ఏర్పాటు చేశారు. వార్డుల విభజనకు రెండు రోజులే గడువు ఇవ్వడంతో క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే అధికారులు కార్యాలయాల్లో కూర్చొని మమ అనిపించారని ఆరోపణలు వస్తున్నాయి. నీలగిరి మున్సిపాలిటీలో అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు అధికారులు తలొగ్గి ఇష్టారాజ్యంగా వార్డులు విభజించారని విమర్శలు వస్తున్నాయి. కాలనీల భౌగోళిక స్వరూపానికి భిన్నంగా, వంద అడుగుల రహదారుల ఆవల ఉన్న కాలనీలను కలుపుతూ వార్డులను ఏర్పాటు చేయడంపై రాజకీయపార్టీల నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
ముగిసిన ఐదేళ్ల పాలన
ఉమ్మడి జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల పాలక మండళ్ల ఐదేళ్ల పదవీ కాలం సోమవారంతో ముగిసింది. 210 మంది కౌన్సిలర్లు బుధవారం నుంచి తాజా మాజీ ప్రజాప్రతినిధులుగా మిగిలిపోనున్నారు. చివరి రోజు మంగళవారం నల్గొండతో పాటు ఇతర మున్సిపాలిటీల్లో ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేశారు. పాలకవర్గ సభ్యులను ఆయా మున్సిపాలిటీ అధికారులు సన్మానించి వీడ్కోలు పలికారు. ప్రజల సమస్యలను పరిష్కరించాలనే లక్ష్యంతో నిరసనలు, ఆగ్రహం వ్యక్తం చేసినా మనసులో పెట్టుకోకుండా కొత్త కౌన్సిల్ వచ్చే వరకు సహకరించాలని కౌన్సిలర్లు అధికారులను కోరారు.
ప్రత్యేక పాలన అధికారుల నియామకం
నల్గొండ జిల్లాలో దేవరకొండ, మిర్యాలగూడ, నల్గొండ; సూర్యాపేట జిల్లాలో కోదాడ, హుజూర్‌నగర్, సూర్యాపేట; యాదాద్రి జిల్లాలో భువనగిరి మున్సిపాలిటీ పాలకవర్గం గడువు పూర్తి కావడంతో ప్రభుత్వం వీటికి ప్రత్యేక పరిపాలన అధికారులను నియామకం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా ఏర్పాటు చేసిన 11 మున్సిపాలిటీలకు తహసీల్దార్లు, ఎంపీడీవోలు ఇన్‌ఛార్జి కమిషనర్లు (ప్రత్యేకాధికారులు)గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా జిల్లా కేంద్రాలకు ఆయా జిల్లా పాలనాధికారులను, మిగతా నాలుగు మున్సిపాలిటీలకు డీఆర్వో, ఆర్డీవోలను ప్రత్యేక అధికారులుగా నియమించారు. పుర పోరు జరిగి కొత్త పాలకవర్గాలు కొలువుదీరే వరకు ప్రత్యేక అధికారుల పాలన కొనసాగనుంది.
5వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ
పుర యంత్రాంగం విభజించిన వార్డులపై సందేహాలు, అభ్యంతరాలు ఉంటే తెలపడానికి ఈనెల 5వ తేదీ వరకు సమయం కేటాయించారు. ఫిర్యాదులు వస్తే వెంటనే పరిశీలించి మార్పులు చేర్పులకు అవకాశం ఉంటే పరిష్కరిస్తారు. మరుసటి రోజు అంటే 6న ప్రత్యేక అధికారుల ఆమోదం తీసుకుని 7న తుది జాబితా వెల్లడించనున్నారు. ఆ తర్వాత ఇటీవల పోలింగ్ బూత్‌ల వారీగా చేపట్టిన ఓటర్ల కుల గణనను వార్డుల వారీగా విభజించి వాటి వివరాలను అధికారికంగా ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఇదీ చూడండి : నలుగురు మహిళలు... ఒకే రోజు అదృశ్యం