కరోనా విపత్కాలంలోను యాదాద్రి ఆలయ నిర్మాణ పనులు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. ఆరు రాజగోపురాలు, దివ్య విమానంతో కూడిన ప్రధానాలయంలో... నలువైపులా అష్టభుజ మండప ప్రాకారాలు, ఉప ఆలయాలు నిర్మితమవుతున్నాయి. పూర్తిగా కృష్ణశిలలతో 4.03 ఎకరాల్లో రూపుదిద్దుకుంటున్న పంచనారసింహుల ప్రాంగణం... త్వరలోనే భక్తులను దర్శనమివ్వనుంది. 2016 నుంచి ఇప్పటివరకు 900 కోట్ల రూపాయలకు పైగా పనులు జరగ్గా... 740 కోట్ల చెల్లింపులు చేసినట్లు యాదాద్రి ఆలయాభివృద్ధి ప్రాధికార సంస్థ- యాడా చెబుతోంది. గర్భాలయ ద్వారాలు, యాగశాల, రామానుజ కూటమి, ధ్వజస్తంభ బలిపీఠం, మహాముఖ మండపం పూర్తయ్యాయి. అనుబంధ ఆలయమైన శివాలయ పునర్నిర్మాణంలోనూ... ప్రధాన కట్టడాలు పూర్తయ్యాయి. గర్భాలయం, పార్వతీదేవి మందిరం, వినాయకుడి గుడి, నవగ్రహాల మందిరం, సుబ్రమణ్యస్వామి సన్నిధి నిర్మాణంలో ఉన్నాయి.
ప్రధానాలయ గోపురాలు, అష్టభుజ ప్రాకార మండపాలకు తుది మెరుగులు దిద్దితున్నారు. సాలహారాలలో విష్ణుమూర్తుల విగ్రహాల పొందిక... అద్దాల మండపం, కల్యాణ నరసింహుని వర్ణచిత్రం, విమానంపై ఆలయ దేవుడి రూపం, తిరువీధులలో ఫ్లోరింగ్ పనులు మొదలుపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రథశాల నిర్మాణం, నిత్య కల్యాణ మండపం, దర్శన వరుసల సముదాయం, నీటి పారుదలకు పైపులైన్లు ఏర్పాటు చేయాల్సి ఉంది.
తగ్గిన ఆదాయం
లాక్‌డౌన్ దృష్ట్యా ప్రస్తుత పరిస్థితుల్లో... 30 కోట్ల మేర ఆదాయానికి గండి పడిందని ఆలయ అధికారులు అంటున్నారు. ఏటా ఏప్రిల్, మే నెలల్లో సెలవుల వల్ల... పెద్దసంఖ్యలో భక్తుల రాకతో వేసవిలో భారీస్థాయిలో ఆదాయం వచ్చేది. ఆంక్షల కారణంగా ఆన్‌లైన్‌లో సేవలు కొనసాగుతున్నా... అనుకున్న స్థాయిలో రాబడి లేదు. స్వామివారికి ఏకాంతంగా ఆర్జిత సేవలు మాత్రమే ప్రస్తుతం నిర్వహిస్తున్నారు. అన్నీ అనుకూలిస్తే... వచ్చే దసరాకు స్తంభోద్భవుడి ఆలయం పూర్తవుతుందని యాడా ధీమా వ్యక్తం చేస్తోంది.
ఇదీ చదవండిః డ్రైవర్ లేని బస్సు..అలా దూసుకెళ్లింది..