చేనేత కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ కేంద్రంలో చేనేతలు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక తహసీల్దార్‌కు వినతి పత్రం అందించారు. చేనేత సహకార సంఘం ఆవరణలోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూల మాల వేసి ర్యాలీ ప్రారంభించారు. అనంతరం మోత్కూరులోని పలువురు జాతీయ నాయకుల విగ్రహాలకు వినతిపత్రాలు అందజేశారు. కరోనా సమయంలో వృత్తిని కోల్పోయిన చేనేత కుటుంబాలకు 7500 రూపాయలు చెల్లించి ఆర్ధికంగా ఆదుకోవాలని కోరారు.
చేనేత కార్మికులు ఉత్పత్తి చేసిన వస్త్రాలను ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. నేతన్నల సంక్షేమం కోసం 1000 కోట్ల రూపాయలు కేటాయించాలని కోరారు. చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకోకుండా వారికి పని కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు లక్ష్మీనరసయ్య, మండల పద్మశాలి సంఘం అధ్యక్షుడు గంజి సోమయ్య, జల్ది రాములు, పోచం కన్నయ్య , మంచె గోవర్ధన్, కొంగ రాములు, పెండెం శ్రీను పాల్గొన్నారు.
ఇవీ చూడండి: బోధన్ కుంభకోణంపై గవర్నర్‌కు ఫిర్యాదు