Donkey Scam In Telangana : ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా గాడిద పాల గురించి విస్తృతంగా చర్చ సాగుతుంది. మార్కెట్లో హైప్, డిమాండ్ ఆసరాగా తీసుకుని తమిళనాడుకు చెందిన ఓ ముఠా గాడిదల పెంపకం, పాల ఉత్పత్తి, లాభాల పేరిట ఆశ చూసి ఔత్సాహిక రైతులను నమ్మించి మోసం చేసింది. తాజాగా తెలుగు రాష్ట్రాలో గాడిద పాల కుంభకోణం వెలుగు చూసింది.
ఫ్రాంచైజీ మోడల్‌లో గాడిద పాలు ఉత్పత్తి చేసిన తమ పాలు తీసుకుని ఓ సంస్థ దాదాపు రూ.100 కోట్లు ఎగవేసిందని బాధిత రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన గాడిద పాల ఉత్పత్తిదారులు, ఔత్సాహిక యువకులు, మహిళలు తమ గోడ వెల్లబోసుకున్నారు. చెన్నైలో డాంకీ ప్యాలెస్ ఫ్రాంచైజీ గ్రూపు సభ్యులు తమను నమ్మించి నిలువునా మోసం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
సంప్రదించగా మోసం : కరోనా నేపథ్యంలో బహుళ పోషకాలు, రోగ నిరోధక శక్తి ఇచ్చే గాడిద పాలకు డిమాండ్ ఉందంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడంతో అవి చూసి వారిని సంప్రదించామని బాధితులు తెలిపారు. డాంకీ ప్యాలెస్ మిస్టర్ బాబు ఉలగనాథన్ ఆధ్వర్యంలో గిరి సుందర్, బాలాజీ, సోనిక రెడ్డి, డాక్టర్ రమేష్ బృందం తమ వద్ద సెక్యూరిటీ డిపాజిట్ కింద ఒక్కో రైతు వద్ద నుంచి రూ.5 లక్షలు తీసుకున్నారని ఆరోపించారు.
గవర్నర్ అనుమతి రాగానే ఈ-రేస్ స్కామ్‌లో కేటీఆర్‌పై చర్యలు : సీఎం రేవంత్‌రెడ్డి
ఒక్కో పాడి గాడిద రూ.80 వేల నుంచి 1.50 లక్షల రూపాయల చొప్పున విక్రయించగా, ఆ గాడిదల నుంచి ఉత్పత్తి చేసిన పాలు లీటరు రూ.1600 చొప్పున సేకరిస్తామని ఒప్పందం చేసుకున్నారని తెలిపారు. మూడు మాసాల పాటు నమ్మకం కలిగించేలా నగదు చెల్లించారని, ఆ తర్వాత నిర్వహణ ఖర్చులు, షెడ్ నిర్మాణం, సిబ్బంది జీతాలు, వెటర్నరీ చికిత్స ఖర్చులు ఇవ్వడం లేదని వాపోయారు.
దీనిపై వారిని ప్రశ్నించగా ఒక్కొక్కరికి రూ.15 లక్షల నుంచి రూ.70 లక్షల చొప్పున బ్యాంకు చెక్కులు రాసి ఇచ్చారని, అవి బ్యాంకులో సమర్పిస్తే బౌన్స్ అయ్యాయని వాపోయారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో 400 మందికి పైగా రైతులు తమలాగా రూ.100 కోట్ల వరకు బాకీల రూపంలో నష్టపోయారని, ఇదొక పెద్ద కుంభకోణమని, దీని వెనుక రాజకీయంగా పెద్దల హస్తం ఉండవచ్చని సందేహం వ్యక్తం చేశారు.
ఆత్మహత్యే శరణ్యం : ఈ విషయంపై చెన్నైలో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్లగా పోలీసులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఒప్పందంలో ఇచ్చిన జీఎస్‌టీ సంఖ్య, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్ కూడా నకిలీవేనని అన్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున తెచ్చిన అప్పులు, వడ్డీలు భారంగా మారాయని, కుటుంబ సభ్యుల వైద్యం, పిల్లల చదువుకు కూడా డబ్బులు లేవని తక్షణమే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రత్యేక చొరవ తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. లేనిపక్షంలో తమకు ఆత్మహత్యలే శరణ్యమని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఆన్లైన్లో లోన్ తీయించి మరీ రూ. 30 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు
స్పామ్ కాల్స్ వేధిస్తున్నాయా?- డోంట్ వర్రీ- కేంద్రం పక్కా స్కెచ్‌తో వచ్చిందిగా..!