Two Persons Arrested After Tring to Meet CP in Khammam : సాధారణంగా ఎవరితోనైనా దురుసుగా ప్రవరిస్తే పోలీసులు వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. కానీ ఓ ఇద్దరు వ్యక్తులు తాము జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యులమంటూ పుష్పగుచ్ఛంతో పోలీసు కమిషనర్‌ను కలిసే ప్రయత్నం చేయగా వారిని అరెస్టు చేశారు. అదేంటి సీపీని కలిసి పువ్వు ఇచ్చేందుకు ప్రయత్నిస్తే అరెస్టు చేస్తారా అని అనుకుంటున్నారా ?. మామూలుగా ఎవరిని ఎవరూ ఏ కారణం లేకుండా ఏమీ చేయరు. అలాంటిది పోలీసులు వారిని అరెస్టు చేశారు అంటే వీరి గురించి తెలుసుకోవాల్సిందే మరి.
ఖమ్మం మూడో పట్టణ ఇన్‌స్పెక్టర్ రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం విజయవాడకు చెందిన పురాణం పద్మజ, శ్రీపతి జగదీశ్వరరావు తాము జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యులమంటూ ఖమ్మం పోలీసు కమిషనర్ కార్యాలయానికి గురువారం వెళ్లారు. పుష్పగుచ్ఛంతో కార్యాలయంలోని సీపీ సునీల్‌దత్‌ను కలిసేందుకు వెళ్లిన వీరి ప్రవర్తనను అక్కడున్న పోలీసులు అనుమానించారు. దీంతో ఈ విషయాన్ని సీపీ దృష్టికి తీసుకెళ్లిన సిబ్బంది ఆయన అనుమతితో ఖమ్మంలో మూడో పట్టణ పోలీసులు అప్పగించారు.
మానవ హక్కుల కమిషన్‌లో పదవి ఇప్పిస్తామంటూ : దీంతో విచారణ చేపట్టిన ఇన్‌స్పెక్టర్ రమేశ్, ఎస్‌ఐ రమేశ్, గతంలోనే పురాణం పద్మజ, శ్రీపతి జగదీశ్వరరావుపై అనేక ఆరోపణలు ఉన్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఖానాపురానికి చెందిన సురేశ్‌కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో పదవి ఇప్పిస్తామని తన వద్ద సెప్టెంబరులో పద్మజ, శ్రీపతి జగదీశ్వరరావు నగదు తీసుకుని మోసం చేసినట్లు సురేశ్‌కుమార్ ఫిర్యాదు చేశారని ఇన్‌స్పెక్టర్ వివరించారు. పైగా జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యులమంటూ పోలీసు కమిషనర్‌ను సైతం బురిడీ కొట్టించేందుకు ప్రయత్నించగా కటకటాలపాలయ్యారు.
అలాంటి వారి పట్ల జాగ్రత్త : మరోవైపు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొందరు మోసం చేస్తున్నారని, ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ ఇప్పటికే పోలీసులు పలుమార్లు హెచ్చరించారు. ఉపాధి కోసం ఎదురు చూస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని కొందురు ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. నమ్మించి బురిడీ కొట్టే ప్రయత్నం చేస్తుంటారని వివరించారు. అలాంటి వారిని నమ్మి మోసపోవద్దని సూచించారు.
చిన్న మల్లయ్య పెద్ద ప్లాన్ : ఊరంతా నమ్మితే - ఉన్నదంతా ఊడ్చేసి రూ.2 కోట్లతో జంప్
ఫేక్ కోర్ట్ నడుపుతూ భారీ స్కామ్- ఐదేళ్లుగా జడ్జిలా తీర్పులు- చివరకు ఏమైందంటే?