Ponds Restoration in Hyderabad : హైదరాబాద్‌లో ఆక్రమణలు, దుర్గంధం, కాలుష్య కోరల్లో చిక్కుకున్న చెరువులకు త్వరలోనే మోక్షం కలగనుంది. చెరువులను పునరుద్ధరించే బాధ్యతను హైడ్రా తీసుకుంది. మొదటి దశలో ముఖ్యంగా 8 చెరువులను కాలుష్యం లేకుండా, అందులో వ్యర్ధాలు కలవకుండా అభివృద్ధి చేస్తారు. చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్‌తో పాటు అందమైన పచ్చని వనాలతో పర్యాటక ప్రాంతాలుగా మార్చాలని నిర్ణయించారు.
ఒక్కో చెరువుకు సుమారుగా రూ.5 కోట్లకు పైగా ఖర్చవుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బెంగళూరు తరహాలో ఇక్కడి చెరువులను అభివృద్ధి చేయడానికి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అంబర్‌పేటలోని బతుకమ్మ కుంట చెరువును పరిశీలించారు.హైదరాబాద్ నగర పరిధిలో ప్రస్తుతం ఉన్న 185 చెరువులకు ఒక రూపు తేవడానికి హైడ్రా ప్రణాళికను రూపొందించింది.
ముందుగా రాజేంద్రనగర్‌లోని (గతంలో) అప్పా(తెలంగాణ పోలీస్ అకాడమీ) చెరువు (50 ఎకరాల 09 గుంటలు), మాదాపూర్‌లోని సున్నం చెరువు (41.9), నిజాంపేటలోని యెర్రకుంట, కూకట్‌పల్లిలోని నల్లచెరువు (34.5), చందానగర్‌లోని ఈర్లచెరువు, మాదాపూర్‌లోని తమ్మిడిచెరువు (39.6), ఖాజాగూడలోని తౌతానికుంట (8), అంబర్‌పేటలోని బతుకమ్మ కుంట చెరువు (17.3)లను పునరుద్ధరించాలని నిర్ణయించారు.
అనుమతితోనే ఆక్రమణల తొలగింపు : ఇప్పటికే కొన్ని చెరువుల దగ్గర హైడ్రా అధికారులు ఆక్రమణలను తొలగించారు. మాదాపూర్‌లోని తమ్మిడి చెరువు దగ్గర సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్‌కన్వెన్షన్ సెంటర్ భవనాలను పూర్తిగా కూల్చివేశారు. చెరువు చుట్టుపక్కల ఆక్రమణలను తొలగించారు. ఫేజ్-1లో భాగంగా చేపట్టే చెరువుల దగ్గర కబ్జాలో ఉన్న వారి అనుమతితో నిర్మాణాలను తొలగించి పునరుద్ధరణ చేపట్టాలని నిర్ణయించారు.
ఈ చెరువుల విస్తీర్ణం 30 ఎకరాల నుంచి 50 ఎకరాల వరకుంది. ఈ 8 చెరువుల పునరుద్ధరణకు సుమారుగా రూ.40 కోట్లు వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఫేజ్-2లో కొన్ని చెరువుల పునరుద్ధరణను బల్దియా చేపట్టనుంది. హెచ్‌ఎండీఏతో మరో వంద చెరువులకు ప్రాణం పోయనున్నారు.
పునరుద్ధరణలో ముందుగా..
- ప్రతి చెరువులో ముందుగా పూడిక తీసి ఆ మట్టితో చుట్టూ గట్లు, వాకింగ్ ట్రాక్ నిర్మిస్తారు.
- నాలాల నుంచి వచ్చే వ్యర్ధాలు నేరుగా చెరువులో కలవకుండా క్లీన్ చేయడానికి మినీ శుద్ధి కేంద్రాల ఏర్పాటు..
- ఒక చెరువులోని నీరు మరో చెరువులోకి వెళ్లేలా గొలుసుకట్టు విధానాన్ని అభివృద్ధి చేస్తారు.
మీ ఇళ్ల జోలికి రాం - ఆ కాలనీ వాసులకు హైడ్రా చీఫ్ రంగనాథ్ హామీ