యాదాద్రి భువనగిరి జిల్లాలో చేపడుతున్న యాదాద్రి రోడ్డు విస్తరణ బాధితులకు పరిహారం చెల్లించాకే కూల్చివేత చేపట్టాలని కాంగ్రెస్ నియోజకవర్గ బాధ్యుడు బీర్ల ఐలయ్య డిమాండ్ చేశారు. యాదగిరిగుట్ట పట్టణంలో కొండ చుట్టూ చేపడుతున్న వలయ రహదారి రోడ్డు పనులను బాధితులతో కలిసి ఆయన అడ్డగించారు.
రోడ్డు ప్రణాళిక మార్చాలని బీర్ల అయిలయ్య, పట్టణ అధ్యక్షుడు భరత్ డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగేంత వరకు కాంగ్రెస్ పార్టీ వారికి అండగా ఉంటుందని అయిలయ్య తెలిపారు. రోడ్డు గురించి ఇంకా చర్చలు సాగుతున్న తరుణంలో పనులు చేపట్టడం సబబు కాదని బాధితులు వాపోయారు.
చావే శరణ్యం..
సరైన పరిహారం తేలకముందే పనులు చేపడితే మాకు చావే శరణ్యమంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న ఎస్ఐ యాదయ్య, సిబ్బందితో అక్కడికి చేరుకొని, ఆందోళనకారులను తరలించే ప్రయత్నం చేశారు. ఆగ్రహం వ్యక్తం చేసిన బాధితులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఓ మహిళ సీసాలో పెట్రోల్‌తో వచ్చి కలకలం రేపింది. గొడవ ముదురుతుండటంతో అధికారులు పనులు నిలిపివేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఇదీ చూడండి: మహిళ మెడలో నుంచి 4 తులాల గొలుసు అపహరణ