జులై ఆరున ప్రపంచ జూనోసిస్ దినోత్సవం జరుపుకొంటారు. మనుషుల నుంచి జంతువులకు సోకే వ్యాధులను యాంత్రోపోనోసిస్ అంటారు. జంతువుల నుంచి మానవులకు సంక్రమించే వ్యాధులను జూనోసిస్ అంటారు. జంతువులపై ఎక్కువ ఆపేక్ష చూపడం వల్ల రోగాలు వస్తాయని శాస్త్రవేత్తలు, పలువురు ప్రముఖ వైద్యులు చెబుతున్నారు. పెంపుడు జీవాల వల్ల మనకు వచ్చే వ్యాధులు 146 ఉన్నాయి. ఇవి మూడు రకాలుగా అంటే బ్యాక్టీరియా, వైరస్, పరాన్న జీవుల ద్వారా వస్తుంటాయి.బ్యాక్టీరియా ద్వారా వచ్చే రోగాలు ప్లేగు, ఆంత్రాక్స్, టీబీ, టైఫాయిడ్, బూసల్లోసిస్ వైరస్ వల్ల వచ్చేవి రేబిస్, స్వైన్‌ఫ్లూ, బర్డ్‌ఫ్లూ, మెదడువాపు పరాన్నజీవుల వల్ల వచ్చే రోగాలు చర్మ సంబంధరోగాలలైన గజ్జి, తామర, కడుపులో నట్టలు చేరడం లాంటివి.
ముందస్తు టీకాలు
నేర పరిశోధనలు, కాపలా నేస్తాలుగా పెంచుకునే కుక్కలకు, ఇతర పెంపుడు జంతువులకు సరైన యజమాన్య పద్ధతులు, నివారణ చర్యలు చేపట్టకపోతే మానవులకు రోగాల వ్యాప్తి చెందుతాయి. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకు పెనుముప్పు ఏర్పడే పరిస్థితి ఉంది. ప్రతి జంతు ప్రేమికుడు విధిగా వారు పెంచుకుంటున్న జీవాలను పరిశీలిస్తూ రోగ నివారణ చర్యలు చేపట్టాలి. ఎప్పటికప్పుడు పశువైద్యుల సలహాలు పాటించి క్రమం తప్పకుండా నట్టల నివారణ మందులు, ఇతర వ్యాధుల నివారణకు ముందస్తూ టీకాలు వేయిస్తే జంతువులతోపాటు మనం ఆరోగ్యంగా ఉండవచ్చు.
నేడు ఉచితంగా టీకాలు వేస్తాం
జూనోసిస్ డే సందర్భంగా సూర్యాపేట పట్టణంలోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలోని పశువైద్యశాలలో శనివారం కుక్కలకు ఉచితంగా యాంటి రేబిస్ టీకాలు వేస్తాం. గత సంవత్సరం నుంచి ఉచితంగా టీకాలు వేస్తున్నాం. జంతు ప్రేమికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పశుసంవర్ధక శాఖ జేడీ, సూర్యాపేట డాక్టర్ వేణుమనోహర్‌రావు పేర్కొన్నారు.
ఇదీ చూడండి : ఇవాళే పదోతరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు