పట్ట పగలే తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం కప్రాయపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బచ్చ రాములు కుటుంబ సభ్యులతో కలిసి తన సోదరుని ఇంట్లో విందుకు హాజరయ్యారు. తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం పగలగొట్టి ఉంది. ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా... దొంగతనం జరిగినట్లు గుర్తించారు.
ఇంట్లో ఉన్న పదిన్నర తులాల బంగారు ఆభరణాలు, 13 వేల రూపాయల నగదు అపహరణకు గురైనట్లు బాధితులు తెలిపారు. సమాచారం తెలియగానే ఘటన స్థలానికి చేరుకున్న క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ బృందాలు ఆధారాలు సేకరించే పనిలో పడ్డాయి. బాధితుడు రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.