యాదాద్రి భువనగిరి మండలంలోని బస్వాపురం జలాశయం నిర్మాణం మొదట 0.8 టీఎంసీల సామర్థ్యంతో ప్రారంభమై 11.33 టీఎంసీలకు పెరిగింది. ఇందులో బీఎన్ తిమ్మాపూర్‌తో పాటు యాదగిరిగుట్ట మండలంలోని లప్పానాయక్ తండా, తుర్కపల్లి మండలంలోని చోక్లాతండా , కొక్యాతండా, పీర్యాతండాల్లో సుమారు 2800 ఎకరాల భూములతో పాటు.. ఇళ్లు పూర్తిగా మునిగిపోతున్నాయి.
గ్రామాలు ఖాళీ చేయాల్సిన పరిస్థితి సైతం ఏర్పడింది. ఇందులో పెద్ద గ్రామమైన బీఎన్ తిమ్మాపూర్ గ్రామంలో 1800 ఎకరాలకు గాను విడతల వారీగా ఇప్పటివరకు 600 ఎకరాలకు మాత్రమే పరిహారం అందింది. 1056 మందికి పునరావాస ప్యాకేజీ అందాల్సి ఉండగా 640 మందికి మాత్రమే అందింది. మిగతా వారికి అందించడంలో ప్రభుత్వం జాప్యం చేస్తుందని బాధితులు మండిపడుతున్నారు. వీరికి పునరావాసం చూపించడంలోనూ అధికారులు కాలయాపన చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా 16వ ప్యాకేజీలో సుమారు రెండు లక్షల ఎకరాలకు సాగు, తాగునీరు కోసం ప్రాజెక్టు చేపట్టారు. రూ.1610 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన పనులు ఇప్పటివరకు 60% పైగా మాత్రమే పూర్తయ్యాయి. గతంలో పరిహారం అందుతుందో, లేదోనని భయంతో ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ప్రాజెక్టు అధికారుల సమక్షంలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
మరో రైతు బెంగతో గుండెపోటు వచ్చి మృతి చెందాడు. 28 రోజులుగా దీక్షలు చేపడుతున్నా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం విచారకరమని ప్రభుత్వ పెద్దలు, నాయకులు తమకు రావాల్సిన పరిహారం త్వరగా ఇప్పించాలని ముంపు గ్రామాల ప్రజలు కోరుతున్నారు. నిర్వాసితులకు పరిహారం అందేలా ప్రభుత్వానికి నివేదించామని.. అవార్డు విచారణ పూర్తయిన తర్వాత నిర్వాసితుల ఖాతాలో జమ చేస్తామని ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు.
"మేము 28 రోజులుగా దీక్షలు చేపడుతున్నాం. అయినా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మాకు రావాల్సిన పరిహారం త్వరగా ఇప్పించాలి." - బాధితులు
ఇవీ చదవండి: