యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహ స్వామి పుణ్యక్షేత్రం పునఃప్రారంభానికి సన్నాహాలు ఊపందుకుంటున్నాయి. ఇందులో భాగంగా ధ్వజస్తంభం, కలశ ప్రతిష్ఠాపన నిర్వహణకు ముందస్తు ఏర్పాట్లు మొదలయ్యాయి. ప్రధాన ఆలయ అష్టభుజి మండప ప్రాకారాలపై కలశాల స్థాపన చేయనున్నారు. మహాముఖ మండపంలో ధ్వజ స్తంభం నెలకొల్పనున్నారు. మహా కుంభ సంప్రోక్షణ నిర్వహణకు మార్చి 28న ముహూర్తంగా నిర్ణయించగా.. ఆ లోపు పనులన్నీ పూర్తిచేసేందుకు యాడా కసరత్తు చేస్తోంది. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా ఎత్తైన ధ్వజస్తంభం ఏర్పాట్లకు చినజీయర్ స్వామీజీ సూచనలతో ఆదిలాబాద్ అడవుల నుంచి కర్రను తీసుకొచ్చారు. 54 అడుగుల ఎత్తైన కర్రను ధ్వజస్తంభంగా మలిచే పనులను ఇదివరకే చేపట్టారు. ఆలయ పనులు పూర్తి కావడంతో ప్రారంభోత్సవం దృష్టి కేంద్రీకరించిన సీఎం కేసీఆర్(cm kcr yadadri)... ఈనెల 19న 16వసారి సందర్శించారు. ఈ పర్యటనలోనే మహాకుంభ సంప్రోక్షణ ముహూర్తం ఖరారు చేయగా.. మిగిలి ఉన్న పనులను యాడా వేగవంతం చేసింది
చకాచకా ఏర్పాట్లు
ధ్వజస్తంభం స్థాపనకు గర్భాలయం ఎదుట పడమటి దిశలో బలిపీఠం వద్ద ఏర్పాటుకు సన్నాహాలు చేపట్టారు. సీఎం ఆదేశాలతో ఏర్పాట్లు కొనసాగుతున్నాయని యాడా వైస్ ఛైర్మన్ కిషన్ రావు తెలిపారు. ప్రధాన ఆలయం నలువైపులా కృష్ణశిలతో రూపొందించిన అష్టభుజి మండప ప్రాకారాలపై గల విమాన గోపురాలపై కలశాలను పొందు పరిచేందుకు తగు పనులను వేగవంతం చేశారు. కొండకింద గిరి ప్రదక్షిణ రహదారిని విస్తరించే పనుల్లో భాగంగా బండరాళ్లను తొలగించి చదును చేశారు. మొక్కు తీర్చుకునే భక్తుల కోసం ఆ దారిలో బ్రిక్స్ అమర్చుతున్నారు. ప్రస్తుతం కొండపైకి వెళ్లే కనుమదారిలో జీయర్ కుటీర్ ప్రాంతంలో పనులు జరుగుతున్నాయి.
ఇత్తడి తొడుగులు
యాదాద్రి క్షేత్రంలో ప్రధానాలయానికి(yadagirigutta temple opening date) అనుగుణంగా కొనసాగుతున్న పర్వతవర్ధిని రామలింగేశ్వరస్వామి ఆలయ రాజగోపుర ద్వారానికి ఇత్తడి తొడుగుల పనులు జరుగుతున్నాయి. పెంబర్తి కళాకారులతో రూపొందించిన ఇత్తడి తొడుగులను రాజగోపుర ద్వారానికి బిగించేందుకు కళాకారులు మంగళవారం పరిశీలించారు. 12 అడుగుల ఎత్తు, 6 అడుగుల వెడల్పుతో కూడిన రాజగోపుర ద్వారానికి ఇత్తడి తొడుగుల బిగింపు పనులు వారం రోజుల్లో పూర్తవుతాయని పెంబర్తి కళాకారులు తెలిపారు.
ఆలయ ప్రారంభోత్సవం
యాదాద్రి(Yadadri renovation) ఆలయ ఉద్ఘాటన తేదీ మార్చి 28, 2022న ఖరారైన నేపథ్యంలో మహా సంప్రోక్షణ నిర్వహణపై 'యాడా' దృష్టి సారించింది. ఇందులో భాగంగా నిర్వహించే సుదర్శన మహాయాగం కోసం కొండ కింద ఉత్తర దిశలో సుమారు 100 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేసింది. ఈ ప్రాంగణాన్ని చదును చేసి యాగ నిర్వాహకులకు అప్పగించనున్నారు. ఉద్ఘాటనకు సంబంధించిన ఏర్పాట్లపై హైదరాబాద్‌లో సీఎంవో ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి యాడా యంత్రాంగంతో చర్చించారు.
ముందుకొచ్చిన దాతలు
ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు యాదాద్రి(Yadadri renovation) శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ విమాన గోపురం బంగారు తాపడం కోసం బుధవారం దాతలు మరో 11 కిలోల బంగారాన్ని విరాళంగా ప్రకటించారు. మేఘా ఇంజినీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) ఆరు కిలోల బంగారం ఇస్తున్నట్లు ప్రకటించింది. త్వరలోనే సదరు బంగారం లేదా అందుకు సమానమైన నగదును చెక్కు రూపంలో అందజేస్తామని సంస్థ డైరెక్టర్ బి.శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. కేఎన్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్ ఎండీ కామిడి నర్సింహారెడ్డి 2 కిలోలు, ప్రణీత్ గ్రూప్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నరేంద్ర కుమార్ కామరాజు 2 కిలోలు, ప్రముఖ వ్యాపారవేత్త ఎన్.వి.రామరాజు జలవిహార్ పక్షాన ఒక కిలో బంగారాన్ని విరాళంగా ఇస్తామని ప్రకటించారు.
ఇదీ చదవండి: Yadadri renovation: 'బంగారు' యాదాద్రి.. గర్భాలయ ద్వారాలకూ స్వర్ణ తాపడం