AIIMS Bibinagar Medical services : పట్టుమని పది రూపాయిలకే రిజిస్ట్రేషన్.. ఆపై అవసరమైతే కనీస ధరలకే వైద్యనిర్ధారణ పరీక్షలు.. ఇది బీబీనగర్ ఎయిమ్స్ ఆస్పత్రిలో తాజా పరిస్థితి.. ప్రైవేటుతో పోలిస్తే ఇక్కడ చౌకధరలకే అన్ని రకాల పరీక్షలు చేస్తుండటంతో ఈ వైద్యాలయం పేదల పాలిట పెన్నిధిగా మారుతోంది. బీబీనగర్ ఎయిమ్స్‌లో 2020 మే 8న పూర్తిస్థాయి డైరెక్టర్‌గా డాక్టర్ వికాస్ భాటియా బాధ్యతలు స్వీకరించారు.
AIIMS Bibinagar fees : నవంబరులో ఓపీ సేవలు ఆరంభించినా.. ప్రజల నుంచి అంతగా స్పందన రాలేదు. అనంతరం కరోనా దృష్ట్యా ఆన్‌లైన్/ఫోన్ కన్‌సల్టేషన్ సేవలనూ ఇక్కడ అందుబాటులోకి తెచ్చారు. కేంద్ర సర్కారు మంజూరు చేసిన రూ.1028 కోట్లను ఆయా విభాగాలకు కేటాయించారు. వైద్యుల నియామకంతో పాటు పరికరాల కొనుగోలు ముమ్మరం చేశారు. ఫలితంగా వైద్యసేవలు ఊపందుకున్నాయి.
ఓపీ సేవలివే..
ఎయిమ్స్ ఆసుపత్రి ఓపీలో జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్, డెర్మటాలజీ, గైనకాలజీ, ఆర్థోపెడిక్, ఆప్తమాలజీ, ఈఎన్‌టీ, జనరల్ సర్జరీ, కమ్యూనిటీ అండ్ ఫ్యామిలీ మెడిసిన్ సేవలు కొనసాగుతున్నాయి. తద్వారా నానాటికీ రోగుల తాకిడి పెరుగుతోంది. రోజూ 300 నుంచి 400 మంది ఈ సేవలు వినియోగించుకుంటున్నారు. సుమారు 80 నుంచి 100 మందికి రోగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు.
రోజంతా ఉన్నా.. రూ.300లే ఖర్చు
కీళ్లనొప్పులతో బాధ పడుతున్నా. ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లినపుడల్లా పరీక్షలకు రూ.20వేల తీసుకునేవారు. ఎయిమ్స్ గురించి తెలిసి ఇక్కడికి వస్తున్నా. పరీక్షలకు రూ.1400 ఖర్చయ్యాయి. నీరసంగా ఉందంటే రోజంతా వైద్యం చేసి రూ.300 తీసుకున్నారు.
- ఊట్ల యాదగిరి, మల్యాల
అందరికి మెరుగైన వైద్యసేవలు..
అందరికీ మెరుగైన వైద్యం అందించడమే బీబీనగర్ ఎయిమ్స్ లక్ష్యం. అందుకే రోగ నిర్ధారణ పరీక్షల ధరలు అందుబాటులోకి తెచ్చాం. వాటికి అవసరమైన పరికరాల కొనుగోలు ప్రారంభించాం. ఓపీకి రోగుల తాకిడి పెరుగుతోండటంతో ఉదయం 11 గంటలకే రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిపేయాల్సి వస్తోంది. నెలలోపు ఓపీ సౌకర్యాలు మెరుగుపరుస్తాం.
- డాక్టర్ వికాస్ భాటియా, ఎయిమ్స్ డైరెక్టర్
ఇదీ చదవండి: Orphan baby: అమ్మా నేను భారమా.. ఎందుకీ దూరం..?