Yadadri Lakshmi Narasimha Swamy Kalyanam: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. వేద మంత్రోచ్ఛరణలతో బాలాలయం మార్మోగింది. దేవాదాయ శాఖమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి... స్వామి వారిని దర్శించుకొని పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరపున అధికారులు పట్టు వస్త్రాలు అందించారు. పంచనారసింహులు స్వయంభువులుగా కొలువైన క్షేత్రం కల్యాణ క్రతువు వేళ సంప్రదాయ హంగులతో మెరిసిపోయింది.
విమాన గోపుర స్వర్ణతాపడానికి మంత్రి విరాళం
బాలలయం మండపంలో స్వామివారు హనుమంత వాహనంపై రామావతారంలో అలంకరించి విహరింపజేశారు. అనంతరం గజవాహనంపై ఊరేగించి తిరుకల్యాణ మహోత్సవాన్ని ప్రారంభించారు. వేద మంత్రోచ్ఛరణల నడుమ కొండ పరిసరాలు మార్మోగాయి. స్వామివారి కల్యాణం వీక్షించిన భక్తులు తరించారు. యాదాద్రి ఆలయ విమాన గోపుర స్వర్ణతాపడానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి రూ.99.8లక్షలు విరాళంగా అందజేశారు.
పునర్నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి
యాదాద్రి పునర్నిర్మాణ పనులను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులను ఆరా తీశారు. ఈనెల 21న యాదాద్రిలో మహా సంప్రోక్షణ యాగం జరగనున్నందున ఏర్పాట్లపై సమీక్షించారు. బాలాలయంలో స్వామివారి కల్యాణం ఇదే చివరిసారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. స్వామి వారి తిరు కల్యాణ మహోత్సవానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రావాల్సి ఉన్నా.. స్వల్ప అస్వస్థత వల్ల చివరిక్షణాల్లో పర్యటన రద్దయింది.
పట్టువస్త్రాలు సమర్పించిన తితిదే
అంతకుముందు స్వామివారి తిరుకల్యాణ మహోత్సవానికి తిరుమల తిరుపతి దేవస్థానం వారు పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ ఈవో గీతారెడ్డికి తితిదే డిప్యూటీ ఈవో రమేశ్ బాబు, ఛైర్మన్ సతీమణి, తిరుమల అధికారులు ఈ వస్త్రాలు అందజేశారు. మొదట బాలాలయాన్ని సందర్శించి లక్ష్మీనరసింహ స్వామికి పూజలు చేసిన తర్వాత స్వామివారి కల్యాణానికి పట్టువస్త్రాలు అందించారు.