వైద్య విద్యార్థులు వైద్య వృత్తిలో నూతన ఛాలెంజ్‌లు స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. బీబీనగర్ ఎయిమ్స్ పరిశోధనలపై కూడా దృష్టి పెట్టి రాణించాలని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. వైద్య విద్యార్థులు చదువుతో పాటు కల్చరల్, గేమ్స్ మీద కూడా దృష్టి సారించాలని సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ ఎయిమ్స్ ప్రథమ వార్షికోత్సవంలో గవర్నర్‌తో పాటు డైరెక్టర్ వికాస్ భాటియా, కలెక్టర్ అనితా రామచంద్రన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీబీనగర్ ఎయిమ్స్ మ్యాగజైన్ 'ఇన్‌విక్టస్'... ఎయిమ్స్ జర్నీ కాఫీ టేబుల్ బుక్ 'పయనం', గ్రీన్ థీమ్ పార్క్ 'ఎయిమ్స్ వాటికా'ను గవర్నర్ తమిళిసై విడుదల చేశారు.
నూతన ఆవిష్కరణలు చేయాలి:
ఎయిమ్స్ వైద్య కళాశాల ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరాజన్ వర్చువల్ లైవ్‌లో పాల్గొన్నారు. వైద్య విద్యార్థులు రోగుల సమస్యలు శ్రద్ధగా వింటే సగం రోగం అర్థమవుతుందని వివరించారు. రోగులు మనకు చదివే పుస్తకాల్లాంటి వారని తెలిపారు. వైద్య విద్యార్థులు పరిశోధించి, నూతన ఆవిష్కరణలు చేయాలని సూచించారు. మన దేశం కొవిడ్ వ్యాక్సిన్‌ని 55 దేశాలకు ఎగుమతి చేసిందన్నారు. వ్యాక్సిన్ మన దేశంలో తయారవటం గర్వంగా ఉందని పేర్కొన్నారు.
వైద్య విద్యార్థినులు గైనకాలజి ఒక్కటే కాకుండా స్పెషాలిటీ విభాగాల్లో రాణించాలని అన్నారు. బీబీనగర్ ఎయిమ్స్ తొందరలోనే అన్ని విధాలుగా ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. కొవిడ్ సమయంలో విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా క్లాస్ నిర్వహించామని ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్ భాటియా అన్నారు. ఎయిమ్స్‌లో 19 విభాగాలు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయని అన్నారు.