అతని తీన్మార్ దరువు మండలి ఎన్నికల్లో ప్రకంపనలు సృష్టించింది. ఇతర అభ్యర్థులకు చెమటలు పట్టించింది. ప్రధాన పార్టీల మాదిరిగా ఆయనకు బూత్‌స్థాయి కార్యకర్తలు లేరు. అంగ, అర్థ బలాలు లేవు. ఉన్నదల్లా సామాజిక మాధ్యమాన్ని ఆధారంగా చేసుకొని సమస్యలను జనంలోకి తీసుకెళ్లగలిగే చతురత మాత్రమే. అదే బలంగా నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గంలో ప్రచారాన్ని నిర్వహించి అధికార పార్టీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డితో పోటీ పడి ప్రథమ ప్రాధాన్య ఓట్లు సంపాదించిన ఆ సంచలనం...తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ (38). ఒక యూట్యూబ్ ఛానల్‌ను నమ్ముకొని ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైన సరళంగా, వ్యంగ్యంగా విమర్శనాస్త్రాలు సంధించడం, నిత్యం దినపత్రికల్లో వచ్చిన వార్తల్ని విశ్లేషిస్తూ ప్రధానంగా అధికార తెరాసపై విరుచుకుపడటం ఆయన నైజం. అదే ఇప్పుడు ఈ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచేలా చేసింది. ఆయన ఓట్ల వేట ముందు క్షేత్రస్థాయి వరకు కార్యకర్తలున్న ప్రధాన పార్టీలు భాజపా, కాంగ్రెస్‌లు తేలిపోయాయి.
పాదయాత్రతో జనంలోకి..
యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన రైతు కుటుంబం నుంచి వచ్చిన మల్లన్న ఇప్పటికే రెండు సార్లు ఎన్నికల్లో పోటీచేశారు. ఇదే పట్టభద్రుల నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి దాదాపు పదివేల ఓట్లు పొందారు.2019లో హుజూర్‌నగర్ ఉప ఎన్నికలోనూ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. గత నాలుగు నెలల నుంచి ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో పాదయాత్ర నిర్వహించి ప్రజల్లోకి వెళ్లారు. స్థానిక సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేవిధంగా ప్రజలను చైతన్యవంతం చేశారు.
భారీగా ఓట్లు
సుదీర్ఘంగా సాగిన పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లడంతో ఆయనపై కొంత సానుభూతి పెరిగింది. ఎన్నికల సరళిని పరిశీలిస్తే చాలా వరకు ప్రధాన పార్టీల అభ్యర్థులకు మొదటి ప్రాధాన్య ఓట్లు వేసిన వారిలో ఎక్కువమంది మల్లన్నకు ద్వితీయ ప్రాధాన్య ఓట్లు వేసినట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఆలేరు, భువనగిరి, నల్గొండ, జనగాం, వరంగల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతాల్లో ఆయనకు భారీగా ఓట్లు పడ్డాయని తెలిసింది. ప్రజలు తమ సమస్యలు పరిష్కరించే వ్యక్తిగా గుర్తించి తనకు ఓట్లు వేశారని తీన్మార్ మల్లన్న అన్నారు. వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల కోసం ఇప్పటివరకు తాను చేసింది తక్కువేనని, ఇంకా చేయాల్సింది ఎంతో ఉందని ఆయన అన్నారు.
ఇదీ చదవండి: గులాబీకే పట్టం కట్టిన పట్టభద్రులు... రెండు చోట్లా జయకేతనం