మహిళ కస్టోడియల్ డెత్ ఘటనపై సమగ్ర నివేదిక సమర్పించాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ రాచకొండ సీపీ మహేశ్ భగవత్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనపై జులై 28 లోపు సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పీఎస్‌లో ఓ చోరీ కేసులో విచారణకు తీసుకొచ్చిన మరియమ్మ అనుమానాస్పదస్థతిలో మృతిచెందింది. పోలీసులు విచక్షణారహితంగా కొట్టడం వల్లే మహిళ చనిపోయిందంటూ బహుజన విద్యార్థి సమాఖ్య ఎస్హెచ్ఆర్సీని ఆశ్రయించింది.
చోరీ కేసులో పోలీసు స్టేషన్ తీసుకొచ్చిన ఎస్సై మహేష్ , కానిస్టేబుళ్లు రషీద్, జానయ్య విచక్షణారహితంగా కొట్టడం వల్లే ఆమె చనిపోయిందని ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు గణేశ్, మద్దెల ప్రవీణ్, రాంబాబులు కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. రాచకొండ సీపీ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ వారిపై సస్పెన్షన్ వేటు వేసి చేతులు దులిపేసుకున్నారని ఆరోపించారు. ఈ ఘటనకు కారణమైన వారిపై కేసు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకునేలా చూడాలని మానవ హక్కుల కమిషన్‌ను వారు కోరారు.
అసలేం జరిగిందంటే..!
ఓ చోరీ కేసులో మరియమ్మను విచారణ కోసం తీసుకురాగా... యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పీఎస్‌లో జూన్ 18న అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. దొంగతనం కేసు విచారణలో పీఎస్‌కు తరలిస్తుండగా ఆవరణలోనే స్పృహతప్పి పడిపోవడం వల్ల భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయినట్లు ఎస్సై మహేశ్ చెప్పుకొచ్చారు.
ఇప్పటికే చర్యలు..
పోలీసులు కొట్టడంతోనే మరియమ్మ మరణించినట్లు భారీ ఆరోపణలు వచ్చాయి. దీంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశిస్తూ.. చర్యలు చేపట్టారు. స్థానిక ఎస్సై మహేశ్, కానిస్టేబుళ్లు రషీద్, జానయ్యపై బదిలీ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వారిని భువనగిరి జోన్ డీసీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు.
ఇదీ చూడండి: కస్టోడియల్ డెత్ కేస్: కారకులపై హత్యానేరం కేసులు నమోదు చేయాలి